సిటీబ్యూరో, నవంబరు 6 (నమస్తే తెలంగాణ): మహానగరం అభివ ృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అత్యంత మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ ప్రతిపాదనలు రూపొందిస్తున్నది. అందులో భాగంగానే శివారు ప్రాంతాల్లో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్ల విస్తరణతో పాటు అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే నగర శివారులో హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై అత్యాధునిక హంగులతో శాటిలైట్ బస్ టెర్మినల్‌ను నిర్మించేందుకు హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. సుమారు రూ.18 కోట్ల అంచనా వ్యయంతో వనస్థలిపురం పరిధిలో ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ను సిద్ధం చేసింది. మహావీర్ హరిణ వనస్థలి జింకల పారు సమీపంలో 1.2 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనుంది. ఈ ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉండటంతో అనుమతులు వచ్చిన తరువాతే పనులు ప్రారంభించనుంది.
కోర్ సిటీ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ఎల్బీనగర్ వద్ద జిల్లాలకు వెళ్లే బస్సులతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు శాటిలైట్ బస్ టెర్మినల్‌ను నిర్మించాలన్న ప్రతిపాదనలు రూపొందించారు. ఎల్బీనగర్ వద్ద ట్రాఫిక్‌ను పరిషరించడానికి హెచ్ఎండీఏ ఇంటర్ సిటీ , ఇంటర్-స్టేట్ బస్సుల కోసం హరిణ వనస్థలి పార్ సమీపంలో శాటిలైట్ వే సైడ్ బస్ టెర్మినల్‌ను నిర్మించనుంది. నిత్యం ఎల్బీనగర్ బస్టాప్ నుంచి రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణికులు నల్గొండ, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. ఎల్బీనగర్ మీదుగా 600 నుంచి 700 వరకు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు వెళ్తుంటాయి. దీంతో ఇకడ ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. 1.2 కి.మీ. విస్తీర్ణంలో హెచ్ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి డిజైన్లు రూపొందించారు. ప్రయాణికులు, ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు , వారి సిబ్బందికి ఇంటిగ్రేటెడ్ సౌకర్యాలను అందించేలా దీన్ని నిర్మాణం చేయనున్నారు.
నగరం నుంచి జిల్లాలు, ఇతర రాష్ర్టాలకు వెళ్లే ప్రయాణికులు శివారు ప్రాంతాల నుంచే రాకపోకలు సాగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బెంగళూరు జాతీయ రహదారి వైపు వెళ్లే వారు ఆరాంఘర్, శంషాబాద్ నుంచి జిల్లాలకు, కర్నూలు, అనంతరపురం, కడప, బెంగళూరు వంటి పట్టణాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని హెచ్ఎండీఏ పరిధిలోని ఉమ్టా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆరాంఘర్, శంషాబాద్ ప్రాంతాల్లోనే జిల్లా కేంద్రాలకు వెళ్లే బస్సులతో పాటు సిటీ బస్సులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రత్యేకంగా బస్టాండ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇలా గ్రేటర్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డుపై ఉన్న ఇంటర్ చేంజ్లకు సమీపంలోనే బస్ టెర్మినల్స్ ఏర్పాటు కోసం హెచ్ఎండీఏ కార్యాచరణ సిద్ధం చేసి, దశల వారీగా నిర్మాణాలు చేపట్టనుంది.