సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): వానకాలం ముగియడంతో రహదారులకు మరమ్మతులు, కార్పెటింగ్పై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.742.39 కోట్లతో 2807 చోట్ల పనులు చేపట్టాలని నిర్ణయించి, ఈ మేరకు రూ.185.20కోట్లు ఖర్చు చేసి 681 చోట్ల పనులను పూర్తి చేసింది. ఇదే సమయంలో వానకాలం రావడంతో రహదారుల నిర్మాణ పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు కంకర తేలి దెబ్బతిన్న రహదారులతో పాటు వీడీసీసీ రోడ్లను పెద్ద ఎత్తున చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు 2,126 చోట్ల పనులకుగానూ రూ. 557.19 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పనులను వచ్చే ఏప్రిల్ నాటికల్లా పూర్తి చేసి గ్రేటర్ అంతటా రహదారులను అద్దంలా తీర్చిదిద్దనున్నారు.
గ్రేటర్లో రోడ్లపై గుంతలు లేకుండా చేయడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ప్రతి ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇందులో భాగంగానే కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. సుమారు రూ. 1839 కోట్లతో 401 విభాగాలుగా పనులను విభజించారు. మొత్తం 811.96 కిలోమీటర్ల మేర రహదారులను ఆధునీకరించేందుకు జోన్ల వారీగా కాంట్రాక్ట్ ఏజెన్సీలకు పనులు అప్పగించారు. ఇందులో భాగంగానే రెండు విడుతల్లో 684 కిలోమీటర్ల మేర రహదారులను మెరుగు పరిచారు. సీఆర్ఎంపీ రోడ్లలో 2487 సైన్‌బోర్డులు, 760 కిలోమీటర్ల మేర లేన్ మార్కింగ్‌లు, 347 కిలోమీటర్ల మేర పెయింటింగ్, 88 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌ల అభివృద్ధి చేపట్టారు. ఇందుకోసం రూ. 896.72 కోట్లు ఖర్చు చేశారు. సీఆర్ఎంపీ రోడ్లతో పాటు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. అంతర్గత రోడ్లతో పాటు వీలైనంత మేర వాక్యూమ్ డీ వాటర్డ్ సిమెంట్ కాంక్రీట్ (వీడీసీసీ) రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
కాలనీ, బస్తీల్లో రోడ్డు పునర్నిర్మాణం/కార్పెటింగ్ చేయాలనుకుంటే జలమండలి, టీఎస్ ఎస్పీడీసీఎల్ నుంచి తప్పనిసరిగా నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలనే నిబంధన అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తాగు/మురుగునీటి పైపులైన్ పనులు లేవని జలమండలి, భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేసేది లేదని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఆయా విభాగాల పనులు ఉన్న పక్షంలో ప్రతిపాదిత పనులు పూర్తయిన అనంతరం రహదారి నిర్మిస్తారు.