బంజారాహిల్స్/బేగంపేట్/అమీర్‌పేట్/జూబ్లీహిల్స్/బన్సీలాల్‌పేట్/ఎర్రగడ్డ, నవంబర్ 6: తెలంగాణలో బీజేపీకి చోటులేదని, మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజ యం తెలంగాణ రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లో కీలకమైన మలుపుగా మారనుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ సంబరాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్దిచెప్పారని, అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేస్తున్న బీజేపీకి తెలంగాణ రాష్ట్రం లో చోటులేదన్నారు. ఈ గెలుపుతో బీఆర్ఎస్గా మారనున్న టీఆర్ఎస్ పార్టీకి జాతీయ రాజకీయాల్లో తొలివిజయం దక్కినట్లయిందని ఎమ్మెల్యే మాగంటి పేర్కొన్నారు.