జీడిమెట్ల, నవంబర్ 3: సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్‌సాన్‌పల్లిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్‌నగర్‌లోని ఓ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన దిలీప్ (48) తన కుటుంబంతో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి సుభాష్‌నగర్‌లో స్థిరపడ్డాడు. స్థానికంగాఎలక్ట్రికల్ వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నాడు. అతడికి భార్య వినోద(43), కూతురు సుప్రతిక(24), కుమారుడు వంశీ(18) ఉన్నారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడితో సుప్రతిక వివాహం జరిగింది.
సుప్రతికకు రెండేండ్ల కూతురు కాంతి(2) ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో కూతురు, అల్లుడు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సుప్రతిక కొద్ది నెలలుగా తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది. అల్లుడి కేసు విషయంపై మహారాష్ట్రలోని న్యాయవాదితో మాట్లాడేందుకు నలుగురు కుటుంబ సభ్యులు మంగళవారం మారుతీ 800 కారులో అక్కడికి వెళ్లారు. పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్సాన్పల్లి గ్రామ శివారుకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న దిలీప్, వినోద, సప్రతిక, రెండేండ్ల చిన్నారి కాంతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. గత కొన్నేండ్లుగా స్థానికంగా వ్యాపారం చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటున్న కుటుంబం ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో సుభాష్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.