సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): నేరాలు జరిగేందుకు అవకాశం ఎక్కడ ఎక్కువగా ఉన్నదో గుర్తిస్తున్న పోలీసులు.. వాటిని మొదట్లోనే అణిచి వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పెద్ద నేరాలకు అవకాశం ఉండదని హైదరాబాద్ పోలీసులు భావిస్తూ ‘ఈ పెట్టీ కేసులు’ నమోదు చేస్తున్నారు. ఈ కేసుల్లోని నిందితులకు జైలు శిక్షలు ఖరారు చేస్తూ న్యాయస్థానాలు తీర్పు చెబుతున్నాయి. నిబంధనలు పాటించని వారితో పాటు సమయం మించిన తర్వాత వ్యాపారులు నిర్వహించే వారిపై, రోడ్డుపై న్యూసెన్స్ చేసే వారిపై, పోలీసు విధులకు ఆటంకం కలిగించే వారిపై, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారిపై ఈ పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రతి రోజు 20 నుంచి 40 వరకు ఈ పెట్టీ కేసులు నమోదువుతున్నాయి. 2021లో నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో సుమారు 4 లక్షల ఈ పెట్టీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
2016 నుంచి షురూ..
2016లో ఈ పెట్టీ కేసుల నమోదును ప్రారంభించారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది ట్యాబ్‌లతో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పెట్టీ కేసుల నమోదు ప్రభావంతో నేరాలను అదుపు చేయడంలో పోలీసులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. గతంలో సౌత్జోన్లో ఎక్కువ సంఖ్యలో నేరాలు జరిగాయి. ఈ పెట్టీ కేసుల ప్రయోగం తర్వాత అక్కడ నేరాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని పోలీసులు చెబుతున్నారు.
ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం
వాహనదారుడికి 15 రోజుల జైలు
పెండింగ్ చలాన్లు చెల్లించాలంటూ వాహనం ఆపినం దుకు ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వాహనదారుడికి 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ సికింద్రాబాద్ న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పింది. బేగంపేట పోలీసుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 2, తివోలి చౌరస్తాలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు నర్సింగ్‌రావు, సతీశ్‌కుమార్, శ్రీనివాస్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎక్కువ ఉల్లంఘనలు పాల్పడి, పెండింగ్ చలాన్లు ఉన్న వారి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే హరిదాస్ ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అతడి వాహనంపై మూడు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో వాహనదారుడు పోలీసులపై విరుచుకుపడుతూ, అసభ్య పదజాలంతో విధులకు ఆటంకం కలిగించాడు. దీనిపై ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై బి.శ్రీనివాసులు పెట్టీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చడంతో న్యాయస్థానం 15 రోజుల జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది.
ఇటీవల శిక్షలు పడిన కేసులు
బోయిన్పల్లి ఠాణా పరిధిలో గత నెల 21న మధు అనే ఓ ప్రైవేట్ ఉద్యోగి ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులకు అసౌకర్యం కల్పించడంతో అతడిపై ఈ పెట్టీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అతడికి ఐదు రోజుల జైలు శిక్ష పడింది.
కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో గత నెల 10న మద్యం మత్తులో ఓ మహిళ రోడ్డుపై న్యూసెన్స్ చేసింది. ఆమెపై పెట్టీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.