సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) :జీహెచ్ఎంసీ పరిధిలో భూ సేకరణ ప్రక్రియ శర వేగంగా జరుగుతున్నది. నిర్ణీత వ్యవధిలో బాధితులకు పరిహారం అందుతున్నది. తద్వారా సకాలంలో ప్రాజెక్టులు పట్టాలెక్కడమే కాకుండా నిర్ణీత లక్ష్యంలోపు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి కారణం భూ సేకరణ అధికారం కలెక్టర్ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు బదలాయించడమే. గడిచిన ఐదేళ్లలో 8594 ఆస్తులను సేకరించిన అధికారులు దాదాపు 4వేల కోట్ల విలువైన 1788 టీడీఆర్‌లను అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పథకాలకు చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణకు ఇచ్చే నగదు నష్ట పరిహారానికి బదులుగా ప్రవేశపెట్టిన ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)తోనే ఆస్తుల సేకరణ ముమ్మరంగా జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆస్తుల సేకరణలో గణనీయ మార్పు
నాలాల విస్తరణ, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ)తో పాటు వంతెనలు, అండర్‌పాస్‌లు, లింకు రోడ్లు, మాస్టర్‌ప్లాన్ అమలు కోసం ఏటా జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున భూసేకరణ చేపడుతున్నది. గతంలో భూ సేకరణ జరిపే ప్రక్రియలో ఆస్తి విలువను లెక్కించి పరిహారం నిర్ధారించే అధికారం కలెక్టర్‌కు మాత్రమే ఉండేది. ప్రాజెక్టుకు సంబంధించిన ఆస్తుల స్వాధీనంలో ఎడ తెగని జాప్యం జరిగేది. కాగా ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేసి నిర్ణీత వ్యవధిలోపు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం గత ఏడాది సంకల్పించింది. ఇందులో భాగంగానే గ్రేటర్ పరిధిలో జిల్లా కలెక్టర్లకు ఉన్న భూసేకరణ అధికారం బల్దియా కమిషనర్‌కు బదలాయించింది. ప్రత్యేకంగా సంయుక్త కలెక్టర్‌ను అదనపు కమిషనర్ హోదాలో నియమించి భూసేకరణ బాధ్యతలు అప్పగించారు.
అప్పుడు ఆరు నెలలు.. ఇప్పుడు 90 రోజులే..!
ఇది వరకు ఒక ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తులను సేకరించాలంటే నోటిఫికేషన్, ఫైల్ ప్రాసెస్ నుంచి పరిహారం వరకు ఈ ప్రక్రియ ఐదు నుంచి ఆరు నెలలు పట్టేది. కానీ కొత్త విధానంతో 90 రోజులకు కుదించారు. ఇందుకు సరిఫడా సిబ్బందిని సమకూర్చుకున్నారు. కమిషనర్, సంయుక్త కలెక్టర్ పర్యవేక్షణలో ఆస్తుల సేకరణలో సత్ఫలితాలను రాబట్టారు. పాతనగరంతో పాటు మతపరమైన ఆస్తుల సేకరణలో తనదైన మార్కును వేశారు. భూ సేకరణకు తక్షణం నోటీసు ఇవ్వడం, బాధితులకు వెంటనే పరిహారం అందించడం, ప్రాజెక్టు పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేయడంలో తనదైన రీతిలో రాణిస్తున్నారు.