బంజారాహిల్స్, నవంబర్ 3: నిర్మాణ రంగంలో వస్తున్న నూతన పద్ధతులు, మెళకువలతో పాటు నూతన పరిజ్ఞానాన్ని పరిశ్రమలోని వారందరికి పంచుకునేందుకు నెట్వర్క్ ఫర్ పీపుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్పీసీ)ఇండియా క్లబ్ హైదరాబాద్ చాప్టర్‌ను ఏర్పాటు చేశామని ఎన్పీసీ సౌత్‌జోన్ డైరెక్టర్ వంగరి స్వర్ణలత తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్పీసీ లోగోను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన క్రెడాయ్ కౌన్సిల్ చైర్మన్ గుమ్మి రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న తరుణంలో ఈ రంగంలో పనిచేస్తున్న ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, సప్లయిర్స్, ఆర్టిస్ట్‌లు,కాంట్రాక్టర్లతో సహా అన్ని విభాగాలకు చెందిన వారిని ఒకే వేదికపైకి చేర్చాలన్న ఆలోచనతో ఏర్పాటైన ఎన్పీసీ హైదరాబాద్ చాఫ్టర్ ఒక నాలెడ్జ్ హబ్‌గా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆకర్యక్రమంలో రాజన్‌కుమార్ కాచర్ల, చేతనా జైన్, సామ కొండల్‌రెడ్డి, రజినీరెడ్డి, డా.రఘురామ్,కెప్టెన్ గోపాల్‌రెడ్డి, సెక్రటరీ చక్రవర్తి, సంతోశ్, ప్రతిభాజైన్ పాల్గొన్నారు.