సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఎలా చదువాలి ? ఏం నేర్చుకోవాలి? సిలబస్ ఎలా ఉంటుంది? సెమిస్టర్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి? డిటెన్షన్, నాన్ డిటెన్షన్ అంటే ఏమిటి ? వంటి అనేక అంశాలపై మొదటి సంవత్సరం విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంపై యూనివర్సిటీలు దృష్టి సారిస్తున్నాయి. అలాగే కొన్ని మెడికల్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో జోరుగా ర్యాగింగ్లు జరుగుతున్నాయి.
విద్యార్థులు డ్రగ్స్‌కు సైతం అలవాటు పడుతున్నారు. దీంతో విద్యార్థులకు భవిష్యత్తులో జరుగబోయే చెడు ఫలితాల గురించి జేఎన్టీయూ, ఉస్మానియా వంటి ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులతో పాటు అన్ని రకాల అటనామస్ కాలేజీలు, అఫిలియేటెడ్ కాలేజీలలో కూడా విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అందుకనుగుణంగా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ వంటి కోర్సులకు చెందిన వారికి వేర్వేరుగా ఓరియంటేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
ఓరియంటేషన్ల వల్ల మంచి ఫలితాలు..
మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కాలేజీలు, కోర్సులు, సెమిస్టర్ పరీక్షలు, సిలబస్, ర్యాగింగ్, డ్రగ్స్ వాడకుండా విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం కాలేజీలలో నిర్వహిస్తున్న ఓరియంటేషన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. అందుకోసం అన్ని కాలేజీలలో కూడా ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించాలని యాజమాన్యాలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.