మనిషిగా బతికినంతకాలం నలుగురితో మంచితనంగా ఉంటే.. ఆ మంచితనమే మనల్ని, మన కుటుంబాన్ని బతికిస్తుంది అంటారు పెద్దలు. ఈ నానుడిని నిజం చేసి చూపిందో కాలనీ. ఓ నిరుపేద కుటుంబానికి మేమున్నామని నిలబడింది. ఆ నిరుపేద వ్యక్తి.. తాను జీవించి ఉన్నంత కాలం కాలనీలో అందరితో తలలో నాలుకలా ఉన్నాడు. పేదరికం వెక్కిరిస్తున్నా మంచితనమే ఆభరణంగా ముందుకు సాగాడు. నవ్వుతూ నలుగురితో కలిసి పని చేశాడు. తన పనితనంతోనే కాలనీవాసుల నమ్మకాన్ని పొందాడు. జీవన ప్రయాణం సాఫీగా సాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా వచ్చిన అనారోగ్యం తనను కుదిపేసింది. మందులతో నయం అవుతుందన్న జబ్బు మనిషినే దూరం చేసింది. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అకస్మాత్తుగా దూరమయ్యాడు. ఆయన్నే నమ్ముకున్న ఆ కుటుంబం రోడ్డున పడింది. అయితేనేం.. చనిపోయింది మనిషి మాత్రమే.. మానవత్వం కాదంటూ.. కాలనీవాసులు ఒక్కటయ్యారు. ఆ కుటుంబానికి తామున్నామని అండగా
నిలిచారు. తలా కొంత చేయి వేసి పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు.
– మైలార్‌దేవ్‌పల్లి, నవంబర్ 3
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని మార్కండేయనగర్ కాలనీలోని పద్మశాలిపురంలో నివసించే యంజాల నగేశ్ అనే వ్యక్తి మార్కండేయ పద్మశాలీ సంఘం ట్రస్టు భవనంలో కలెక్షన్ బాయ్‌గా పని చేసేవాడు. సంఘంలో చిట్టీలు, లెక్కలు చూడడానికి ఆసరాగా ఉంటాడని ట్రస్టు వారు ఉద్యోగం ఇచ్చారు. సుమారు పది సంవత్సరాలుగా కాలనీలో అందరితో కలిసి తలలో నాలుకలాగ తిరిగాడు. ఆరేండ్ల క్రితం అతనికి బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టడంతో డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతున్నాడు. కుటుంబభారం పెరగడంతో గుడిమల్కాపూర్‌లో ఉదయం 4 గంటలకు వెళ్లి అక్కడ కూరగాయలు తీసుకునే వారి దగ్గర కలెక్షన్ బాయ్‌గా ఉంటూ, పది గంటల నుంచి సంఘం ట్రస్టు భవనంలో పని చేయసాగాడు. ఈ నెల 16న రోజు మాదిరిగా ఉదయం 4 గంటలకు వెళ్లి కలెక్షన్ చేసుకుని భవనంలో మెట్లు దిగుతుండగా కాలు జారి పడిపోయాడు. తల వెనుక భాగంలో తగలడంతో రక్తం ఎక్కువగా పోయింది. చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా, బ్రెయిడెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో వారి కుటుంబంలో 6 సంవత్సరాల లోపు ముగ్గురు చిన్నపిల్లలు, భార్య అనాథలైయ్యారు.
రూ. 12.60 లక్షలు సేకరించి..
అందరితో కలుపుగోలుగా ఉండే యంజాల నగేశ్ కుటుంబానికి కాలనీవాసులు అండగా నిలిచారు. మానవత్వం అందరూ కలిసి ఏకంగా రూ. 12.60 లక్షలను పోగు చేశారు. ఓ పాఠశాల యజమాని ముగ్గురు పిల్లలను నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా చదివించడానికి ముందుకొచ్చాడు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. అంతేగాక కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
నా వంతుగా రూ. లక్ష సాయం
పేద కుటుంబంలో ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉన్నాడని వారంతా చెప్పడం నన్ను కలిచివేసింది. కాలనీవాసులంతా రూ.12.60 లక్షలు జమ చేయడం అభినందనీయం. పిల్లల భవిష్యత్తు కోసం నావంతుగా రూ. లక్ష సహాయం చేశాను. అలాగే వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఆమెకు పింఛన్ ఇప్పిస్తాను.
– ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
ముగ్గురు పిల్లలకు ఉచిత విద్య
స్థానికుల విజ్ఞప్తి మేరకు నగేశ్ కుటుంబానికి నా వంతు సహాయం చేయాలనుకున్నాను. ముగ్గురు చిన్న పిల్లలను చూడగానే బాధ అనిపించింది. మా పయనీర్ పాఠశాలలో ఆ ముగ్గురు పిల్లలకు 10వ తరగతి వరకు ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పాను. అందరిలో కలిసి తిరిగిన నగేశ్ చిన్న వయస్సులో చనిపోవడం బాధాకరం.
– సంరెడ్డి ప్రమోద్‌రెడ్డి, పయనీర్ హైస్కూల్ యజమాని
పిల్లల కోసం నిధి ఏర్పాటు చేశాం
నగేశ్ అకస్మాత్తుగా చనిపోవడంతో ఒక నిధిని సమకుర్చాలని ఇద్దరం అనుకున్నాం. ముందుగా మావంతు సహాయంగా ఇద్దరం రూ. 5 వేల చొప్పున ఇచ్చాం. అనంతరం వారి కుటుంబానికి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలని వాట్సాప్ గ్రూపులో మెసేజ్ చేశాం. చనిపోయిన రోజు నుంచి సంతాప దినం వరకు సుమారు 200 మంది తమ వంతుగా ఆర్థిక సహాయం చేయడంతో రూ. 12.60 లక్షలను జమ చేశాం. ఇంత పెద్ద మొత్తంలో ఎవరికీ ఎప్పుడూ చేయలేదు. నిరుపేద అయిన నగేశ్ మంచితనానికి నలుగురు సహాయం చేస్తారని రుజువు అయ్యింది.
– పులిజాల వివేక్, మునగపాటి వెంకటేశ్, వెంకటేశ్వర స్వామి ఆలయ సభ్యులు
పద్మశాలి ట్రస్టు నుంచి రూ. 3 లక్షలు..
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆప్కో కాలనీలో ఏర్పాటు చేసిన మార్కండేయ పద్మశాలి సంఘం ట్రస్టు భవనం నిర్మించినప్పటి నుంచి మాతోనే ఉన్నాడు. అందులో ప్రతి నెల సంఘం సభ్యులు పొదుపు చేసుకుంటారు. అలాగే చిట్టీలు కూడా నడుస్తాయి. నగేశ్ సుపరిచితుడు కావడంతో సంఘం సభ్యులు సమావేశంలో తీర్మానించి రూ. 3 లక్షలను కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
– కాశిగారి యాదగిరి, ట్రస్టు చైర్మన్