సైదాబాద్, నవంబర్ 2 : ఇరవై ఏండ్లుగా మూడు కాలనీల వాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు జలమండలి అధికారులు పరిష్కారం చూపారు. స్థానికంగా నూతన డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సైదాబాద్ డివిజన్ పరిధిలోని శంకేశ్వరబజార్, సాయిరాంకాలనీ, సాయిగంగా కాలనీల్లో పాత అండర్ గ్రౌండ్ వ్యవస్థలో లోపాలు ఉండటంతో ఇబ్బందులు ఉండేవి. పెరిగిన జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ పైపులైన్ లేకపోవటంతో మురుగునీరు పొంగిపోర్లుతుండటంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. రూ. 15లక్షల వ్యయంతో చేపట్టిన కొత్త పైపులైన్ నిర్మాణ పనులతో కాలనీవాసులకు మురుగునీటి కష్టాలను విముక్తి లభించింది.
స్థానికులు ఇబ్బందులను ఎమ్మెల్యే బలాల దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన స్పందించిన ఆయా ప్రాంతాల్లో పర్యటించి, కొత్త పైపులైన్ నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆస్మాన్‌ఘడ్ జలమండలి అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రస్తుతం శిథిలావ్యవస్థలో ఉన్న 12 ఇంచుల డయా సైజ్‌కు ఏర్పాటుకు రూ.15 లక్షల వ్యయంతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎమ్మెల్యేకు అందజేశారు. ఎమ్మెల్యే నిధులు మంజూరు చేసి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో జలమండలి అధికారులు స్థానికంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను మొదలు పెట్టారు.
శంకేశ్వరబజార్, సాయిరాం కాలనీ, సాయిగంగా కాలనీల్లో అనేక ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ పైపులైన్ శిథిలావ్యస్థకు చేరింది. ప్రస్తుతం ఉన్న పైపులైన్ తొలగించి 12 ఇంచుల డయా సైజ్ వ్యాసార్థ కలిగిన లైన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. పెరిగిన జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టాం. త్వరితగతిన పూర్తి చేయటానికి చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రావణ్‌కుమార్, సైదాబాద్ జలమండలి మేనేజర్