బంజారాహిల్స్, నవంబర్ 2: నాలుగున్నర ఏండ్ల బాలికపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో రెండువారాలపాటు మూతపడిన బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ గురువారం తెరుచుకోనున్నది. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థనను పరిశీలించిన విద్యాశాఖ డీఏవీ పబ్లిక్ స్కూల్‌ను నడుపుకునేందుకు తాత్కాలిక అనుమతిని జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చారు. స్కూల్ నిర్వహణపై తల్లిదండ్రులతో స్కూల్ ప్రతినిధులు చర్చలు జరిపారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు ఇచ్చేలా ఫిర్యాదు బాక్సులను స్కూల్లో ఏర్పాటు చేశారు.
దీంతో పాటు స్కూల్లో బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తమపై ఏవైనా వేధింపులు ఉంటే వెంటనే స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలో భద్రత కోసం సుమారు 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల కూకట్‌పల్లిలోని డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన వసంత రామన్‌ను బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌కు ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించారు. దీంతో పాటు తల్లిదండ్రుల ఫిర్యాదుతో నలుగురు టీచర్లను సైతం బదిలీ చేసినట్లు తెలుస్తున్నది.
అంతేకాకుండా స్కూల్ బస్సులలో ఖచ్చితంగా మహిళా అటెండెంట్స్ ఉండేలా చూడడం. ఎల్కేజీ విద్యార్థులను రెండు సెక్షన్లుగా విభజించడం తదితర చర్యలు చేపట్టామని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు వివరించింది. మొత్తం మీద స్కూల్లో జరిగిన పీడకల లాంటి సంఘటన తర్వాత గురువారం నుంచి స్కూల్ తెరుచుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.