సిటీబ్యూరో, 2 అక్టోబర్ (నమస్తే తెలంగాణ): నగరంలో కల్తీని కట్టడి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇక నుంచి ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్యాధికారుల పర్యవేక్షణలో కల్తీకి చెక్ పెట్టనున్నారు. అంతేకాకుండా తిను బండారాలను విక్రయించే స్టాళ్లను క్షుణ్ణంగా పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇవ్వడంతో పాటు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పానీపూరి బండి నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు అనిమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారులే వ్యాపారుల వద్దకు వచ్చి ఆహార విక్రయ కేంద్రాలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేస్తారు. దీని కోసం ప్రాంతాల వారీగా నిర్ణీత తేదీలలో ప్రత్యేక మేళాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేళాలో స్థానికంగా ఉన్న అన్ని రకాల ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు పాల్గొని వారి హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఇడ్లీ-దోశ బండి, పానీపూరి-ఛాట్ బండి తదితర వాటికి సంబంధించిన లైసెన్స్‌లను పొందవచ్చు. లైసెన్స్ పొందిన వారందరికీ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల విక్రయం, కల్తీ వల్ల జరిగే అనర్థాలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
ఇక నుంచి గ్రేటర్ పరిధిలోని అన్ని ఆహార పదార్థాల విక్రయ కేందాలపై (టీ స్టాల్, పానీపూరి నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు) ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రజలకు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించనున్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు రంగం సిద్ధం చేశారు.