దుండిగల్, నవంబర్ 2: రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకుడు మృతి చెందాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాచుపల్లిలోని లక్ష్మీ కాలనీలో ఉంటున్న చంద్రసేన (62), శ్రీనివాసమ్మ దంపతులు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీనివాసమ్మ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. చంద్రసేన టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా, నిజాంపేట కార్పొరేషన్ 19వ డివిజన్ మీడియా కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం చంద్రసేన తన స్కూటీపై బాచుపల్లి చౌరస్తా సిగ్నల్ వద్ద మల్లంపేట వైపు రోడ్డు దాటుతుండగా.. తన పక్క నుంచి వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో చంద్రసేన రోడ్డుపై పడిపోయాడు. లారీ ముందు టైర్లు అతడి పైనుంచి వెళ్లాయి. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోనే ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే చంద్రసేన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్థానికులను, టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలను దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా, చంద్రసేన కుమారుడు ఎంబీబీఎస్ పూర్తిచేయగా, కూతురు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.