కుత్బుల్లాపూర్, నవంబర్ 1: అతివేగం.. అజాగ్రత్తతో ద్విచక్ర వాహనంపై దూసుకువచ్చి రోడ్డు డివైడర్ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ డబిల్పుర ప్రాంతానికి చెందిన సాయినిఖిల్ (20) కొంపల్లిలోని సాయితేజ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మషౌక్(19) దూలపల్లి సెయింట్ మార్టిన్ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
వీరిద్దరూ స్నేహితులు. మంగళవారం సాయంత్రం ఇద్దరు కలిసి మేడ్చల్ నుంచి కొంపల్లి వైపునకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. మషౌక్ డ్రైవింగ్ చేస్తుండగా.. వెనుకాల నిఖిల్ కూర్చున్నాడు. మార్గమధ్యలోని కొంపల్లి బ్రిడ్జి సమీపంలో అతివేగంతో పాటు అజాగ్రత్తతో దూసుకురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్ ఇనుప రాడ్డుకు ఢీ కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను 108 సహాయంతో గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించకపోవడం, అతివేగంతో దూసుకురావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.