సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సహకార సంఘంలో డిపాజిట్ చేసిన సొమ్మును నొక్కేసిన సొసైటీ కార్యదర్శికి జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించిదని సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు. తెలంగాణలో ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1999 అమలులోకి వచ్చిన తర్వాత మొదటి సారి నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడిందని ఆయన వెల్లడించారు.
కోఠిలో ఉన్న టెలిగ్రాఫ్ ట్రాఫిక్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పలువురు ఉద్యోగులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్లు, ఇతరత్రా డిపాజిట్లు చేశారు. ఈ సొసైటీలో రూ. 52,45,85,868 డిపాజిట్లు ఉన్నాయి. అయితే, సొసైటీ కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తితో పాటు మరో 8 మంది డైరెక్టర్లు డిపాజిట్ నిధులను గోల్మాల్ చేసి, ఆ డబ్బుతో తమ సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారు. 2008లో సీసీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేయడంతో, దీనిపై రెండు కేసులు నమోదయ్యాయి. సెక్షన్ 406, 420, 409 ఐపీసీతో పాటు సెక్షన్ 5, ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1999 కింది కేసు నమోదు చేశారు.
ఇన్స్పెక్టర్ శరత్‌కుమార్ నేతృత్వంలో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా సొసైటీ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులను అటాచ్ చేసి, అనంతరం చార్జిషీట్ దాఖలు చేశారు. జాయింట్ సీపీ గజారావు పర్యవేక్షణలో, ప్రస్తుత ఏసీపీ హరికృష్ణ ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శైలజకు అందజేశారు. వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం ఆకుల కృష్ణమూర్తికి జీవిత కారాగార శిక్ష, రూ. 1.1 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.