బంజారాహిల్స్, నవంబర్ 1: ఫోర్జరీ సంతకాలు, బోగస్ స్టాంపులు సృష్టించి జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన ఫ్లాట్‌ను కబ్జా చేసిన కేసులో తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ. జ్ఞానేశ్వర్ నాయుడు అలియాస్ విజ్జీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. నగరానికి చెందిన వ్యాపారవేత్త, పీసీహెచ్ ఈ- జోన్ యజమాని బల్విందర్ సింగ్‌కు, ముంబైకి చెందిన మార్క్ పోర్ట్‌ఫోలియో సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ రోనక్ కోటేచాకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి.
తన వ్యాపార విస్తరణ కోసం రోనక్ కొటేచా నుంచి సుమారు రూ.20కోట్లు అప్పుగా తీసుకున్న బల్విందర్ సింగ్ తిరిగి చెల్లించలేదు. దీనికి తోడు వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుగా తీసుకున్న రూ.13 కోట్ల కిందకు జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని జ్యోతి సిగ్నేచర్ అపార్ట్మెంట్లో ఉన్న రెండు ఫ్లాట్లు, మియాపూర్‌లో ఉన్న కొంత స్థలాన్ని, ఆర్కే పురంలో ఉన్న స్థలాన్ని కోటేచాకు రాసివ్వడంతో పాటు వాటిని ఆయన సంస్థ పేరుతో రిజిస్టర్ కూడా చేశాడు.
మిగిలిన డబ్బులను ఇస్తానని చెప్పి కాలయాపన చేస్తున్నాడు. గత కొంతకాలంగా కోటేచా డబ్బులు ఇవ్వాలంటూ బల్విందర్‌సింగ్ మీద ఒత్తిడి తీసుకువస్తున్నాడు. దీంతో ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి జీవీజీ. నాయుడును బల్విందర్ సింగ్ ఆశ్రయించాడు.రంగంలోకి దిగిన జీవీజీ నాయుడు జూబ్లీహిల్స్‌లోని జ్యోతి సిగ్నేచర్ అపార్ట్మెంట్లోని 2800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్‌ను రోనక్ కోటేచా తనకు అమ్మినట్లు ఫోర్జరీ పత్రాలు, ఆయన సంస్థ పేరుతో స్టాంపులను, సంతకాలతో సేల్ అగ్రిమెంట్‌ను సృష్టించాడు. ఖాళీగా ఉన్న ఫ్లాట్‌ను ఆక్రమించి తన మనుషులను పెట్టాడు.
అంతటితో ఆగకుండా ఈ ఫ్లాట్‌ను తనకు రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ ఇటీవల రొనక్ కొటేచాపై సిటీ సివిల్ కోర్టులో కేసు వేశాడు. దీంతో తన సంతకాలు ఫోర్జరీ చేసి, పలు పత్రాలను సృష్టించడంతో పాటు దౌర్జన్యంగా ఫ్లాట్‌ను ఆక్రమించాడంటూ రోనక్ కోటేచా ఫిర్యాదు మేరకు జీవీజీ నాయుడు, బల్విందర్ సింగ్ తదితరులపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ 406, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని జీవీజీ నాయుడు కోర్టును ఆశ్రయించగా.. మూడు వారాల పాటు అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు గడువు ఇచ్చింది. ఆ గడువు ఇటీవల ముగియడంతో మంగళవారం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.