శాలిబండ, నవంబర్ 1: అంతర్జాతీయ స్థాయిలో నగరంలోకి బంగారాన్ని అక్రమ మార్గాల ద్వారా తరలిస్తున్న ఓ ముఠా సభ్యులను దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, కస్టమ్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మీ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా మొహినుద్దీన్ (38) ఇటీవల యుఏఈకి వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తిని కలుసుకున్నాడు.
అక్కడి నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణ టికెట్లతోపాటు అదనంగా డబ్బులు చెల్లిస్తానంటూ అతడు ఆఫర్ చేశాడు. అతడు ఇచ్చే బంగారాన్ని అక్రమ మార్గాల ద్వారా హైదరాబాద్కు చేరవేయాలని సూచించాడు. ఒప్పుకున్న మహ్మద్ ఖాజా మొహినుద్దీన్ తన స్నేహితులైన కర్నాటకకు చెందిన రయీస్ అహ్మద్ సయీద్ హుస్సేన్ లంక (48) సరీం హుస్సేన్ (29), ఫౌజాన్ (38)లకు విషయం చెప్పాడు. వారు కూడా సహకరిస్తామంటూ మహ్మద్ ఖాజా మొహినుద్దీన్కు హామీ ఇచ్చారు.
సోమవారం రాత్రి యూఏఈ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఖాజా మొహినుద్దీన్ తన వెంట 1000 గ్రాముల బంగారం ముడి సరుకును తీసుకువచ్చాడు. తన స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి సిటి కాలేజీ వద్ద సంచరిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు ఖాజా మొహినుద్దీన్తోపాటు అతడికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను కస్టమ్ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ రాఘవేంద్రతోపాటు ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.