మారేడ్‌పల్లి, నవంబర్ 1: బెంగళూర్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్‌నకు గురైన ఓ బాలుడిని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని రామగుండం ఆర్పీఎఫ్ పోలీసు సిబ్బంది చేరదీశారు. కిడ్నాపర్‌ను పట్టుకొని రైల్వే పోలీసులకు అప్పగించినట్లు సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మితా ఛటోపాధ్యాయ బెనర్జీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గత నెల 30న బెంగళూర్ రైల్వే స్టేషన్లో బాలుడు కిడ్నాపయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు బెంగళూర్ రైల్వే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడి కిడ్నాప్‌ను సికింద్రాబాద్ సీనియర్ డివిజన్ సెక్యూరిటీ కమిషనర్‌కు సమాచారం అందించారు.
డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లతో పాటు ఆర్పీఎఫ్ పోలీసు సిబ్బంది రైళ్లను తనిఖీ చేశారు. రైలు మార్గంలో బెంగళూరు నుంచి బాలుడిని తీసుకొని కిడ్నాపర్ సికింద్రాబాద్‌కు వస్తున్నట్లు గుర్తించారు. రైలు రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే.. స్థానిక ఆర్పీఎఫ్ పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టింది. బాలుడిని రక్షించి, కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెంగళూర్ రైల్వే పోలీసులకు కిడ్నాపర్‌ను అప్పగించి, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా కమిషనర్ దేబాషిత్మా ఛటోపాధ్యాయ బెనర్జీ కిడ్నాప్ కేసులో నిందితుడిని పట్టుకోవడంతో పాటు బాలుడిని రక్షించిన రామగుండం ఆర్పీఎఫ్ పోలీసు సిబ్బందిని అభినందించారు.