సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం దాదాపు మూడు నెలల పాటు ఇచ్చిన వన్ టైం స్కీం (ఓటీఎస్) గడువు ముగిసింది. రెండు నుంచి మూడు లక్షల మంది పన్ను చెల్లించని బకాయిదారుల జాబితాలో ఉండగా, వీరి నుంచి రూ. వెయ్యి కోట్ల మేర ఆదాయం వస్తుందన్న అంచనాతో ఈ ఓటీఎస్‌కు అవకాశం కల్పించారు. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిల మొత్తాన్ని కేవలం 10శాతం వడ్డీతో ఏకకాలంలో పూర్తిగా చెల్లించి, వడ్డీపై 90శాతం మాఫీని పొందాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. కేవలం 60వేల మంది మాత్రమే సద్వినియోగం చేసుకోగా, వీరి నుంచి సుమారు 138 కోట్ల మేర ఆదాయం వచ్చింది. చివరి రోజు సోమవారం రూ. 30కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే 2020 ఆగస్టు 1న ప్రభుత్వం ఓటీఎస్ పథకం ప్రవేశపెట్టగా, కేవలం 45 రోజుల వ్యవధిలోనే రూ. 450కోట్ల మేర బకాయిలు రాబట్టుకున్నది. ఈ సారి మాత్రం ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. వరుసగా ఆషాఢ బోనాలు, వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగలు రావడం, అన్నింటి కంటే మించి సిబ్బంది ఎక్కువగా డబుల్ బెడ్ర్రూం ఇండ్ల దరఖాస్తుల పరిశీలనపై దృష్టి సారించడంతో ఓటీఎస్ వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓటీఎస్ గడువును మరో రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
మరో రెండు వారాలు పొడిగించండి: డిప్యూటీ మేయర్
వన్‌టైమ్ స్కీం (ఓటీఎస్)ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌ను కోరారు. ఓటీఎస్‌తో జీహెచ్ఎంసీకి ఆదాయం పెరగడంతో పాటు ప్రజలపై కొంత మేర ఆర్థిక భారం తగ్గుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఆస్తిపన్ను బకాయిల చెల్లింపునకు ఓటీఎస్‌ను పొడిగించాలని డిప్యూటీ మేయర్ విన్నవించారు.