సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): విక్రయ ఒప్పందం ప్రకారం నిర్ణీత కాలంలో ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేయనందుకు ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.లక్షా 50వేల భారీ జరిమానాను హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 విధించింది. దీంతో పాటు ఫ్లాట్ కొనుగోలుదారుడికి రూ.62లక్షల 66వేల 466 రీఫండ్ (తిరిగి చెల్లించాలి) చేయాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మిప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ ఆదేశించింది. 2100 చదరపు అడుగులు ఫీట్ల ఫ్లాట్ కొనుగోలుకు ఇరుపక్షాల మధ్య 2016లో రూ.కోటి 11లక్షలకు ఒప్పందం కుదిరింది. దీంతో యాక్సిస్ బ్యాంకు నుంచి రూ.88లక్షల 80వేల హౌసింగ్‌లోన్ తీసుకున్నారు.
దపదఫాలుగా రూ.62లక్షలకు పైగా చెల్లించారు. కాగా, విక్రయ ఒప్పందంలోని 13 ప్రకారం నిర్ణీత సమయంలో ఫ్లాట్‌ను పూర్తిచేసి కొనుగోలుదారుడికి ఇవ్వలేదు. దీంతో కంపెనీ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ.. నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. తాను బ్యాంకు ద్వారా గృహ రుణం తీసుకున్నానని, 34 ఈఎంఐల ద్వారా రుణాన్ని చెల్లించానని పేర్కొన్నారు. అయినా కంపెనీ స్పందించకపోవడంతో పాటు నిర్మాణంలో అలసత్వాన్ని ప్రదర్శించింది. దీంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న కొనుగోలుదారుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కమిషన్-1.. కొనుగోలుదారుడు చెల్లించిన రూ. .62లక్షల 66వేల 466లను 12శాతం వడ్డీతో కలిపి రీఫండ్ చేయాలని కంపెనీని ఆదేశించింది. నష్టపరిహారంగా రూ.లక్ష, కోర్టు ఖర్చుల కింద రూ.50వేలు అందజేయాలని సూచించింది. 45 రోజుల్లో తమ ఆదేశాలను పాటించాలని కంపెనీకి తెలిపింది.