మారేడ్పల్లి, అక్టోబర్ 29: బ్రెయిన్ స్ట్రోక్ తెలియకుండానే మనిషిని కుంగదీసే ప్రమాదకర వ్యాధి అని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు హైదరాబాద్ సిటీ (డీఐజీ) ఈస్ట్ జోన్ రమేష్ మస్తీపురం అన్నారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా శనివారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడు అలవాట్లు, దీర్ఘాకాలిక వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యల వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
ప్రతి ఒక్కరూ వయసు పెరిగే కొద్దీ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. యశోద గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. మొదటిసారిగా యశోద హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స కోసం అత్యాధునిక ‘మెకానికల్ థ్రోంబెక్టమీ’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇప్పటివరకు 250 మందికి పైగా బ్రెయిన్ స్ట్రోక్ పెషెంట్లు ఈ చికిత్సను పొందారని, 80 శాతం మంది చికిత్స తర్వాత తిరిగి మాములు జీవితం గడపగలుగుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్ సీనియర్ న్యూరో అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గిరిగాని తదితరులు పాల్గొన్నారు.