సిటీబ్యూరో , అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) అవకాశం సోమవారం (రేపటి)తో ముగుస్తున్నది. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిల మొత్తాన్ని కేవలం 10శాతం వడ్డీతో ఏకకాలంలో పూర్తిగా చెల్లించి, వడ్డీపై 90శాతం మాఫీని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఐతే గడిచిన రెండు నెలలకు పైగా ఓటీఎస్ అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు 51వేల మంది మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. వీరి నుంచి జీహెచ్ఎంసీకి ఓటీఎస్ రూపంలో రూ. 96కోట్ల ఆదాయం సమకూరింది. వాస్తవంగా ఓటీఎస్‌తో రూ. 300కోట్ల మేర రావొచ్చని జీహెచ్ఎంసీ అంచనా వేసింది.
కాగా, వరుస పండగలు ఆషాఢ బోనాలు, వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండగలు రావడం, అన్నిటి కంటే మించి సిబ్బంది ఎక్కువగా డబుల్ బెడ్ర్రూం ఇండ్ల దరఖాస్తుల పరిశీలనలో దృష్టి సారించిన ఫలితంగా ఓటీఎస్ వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదని గుర్తించింది. ఇందులో భాగంగానే సర్కిళ్ల వారీగా బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, ఏఎంసీలు, డీసీలు, వచ్చే రెండు రోజుల పాటు ఓటీఎస్‌పై విస్తృతంగా అవగాహన కల్పించి బకాయిలు రాబట్టాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వసూళ్లలో నిర్లక్ష్యం వహించే అధికారులపై ఛార్జిమోమోలు జారీ చేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. నేడు ఓటీఎస్ చెల్లింపునకు కార్యాలయాలు తెరిచే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.