మాదాపూర్, అక్టోబర్ 29: మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శనివారం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ షో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ సోమేశ్‌కుమార్ విచ్చేసి ఏవీపీ, క్రెడాయ్ నేషనల్ రాంరెడ్డి, రాంకీ ఎస్టేట్స్ ఎండీ నందకిశోర్, మాంటెడ్ ఎండీ, బియాండ్ అడ్వైజరీ బిజ్వజిత్ పట్నాయక్, నైట్ ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్, కాన్సెప్ట్ యాంబీయన్స్ ముకుల్ అగర్వాల్‌తో పాటు కొరుపోలు సీఈఓ అజితేశ్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ … సామాన్యుల కలలకు అనుగుణంగా ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కొవిడ్ తరువాత హైదరాబాద్‌లో ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయన్నారు. ప్రాపర్టీ మార్కెట్లపై అధ్యయనాల ప్రకారం… గత ఆర్థిక సంవత్సరం త్రైమాసికంతో పోలిస్తే హైదరాబాద్ 222శాతం వృద్ధితో దూసుకుపోతుందని, ప్రాపర్టీ అమ్మకాలు సంవత్సరానికి 140 శాతం వరకు పెరిగినట్లు తెలిపారు. బాచుపల్లి, కొంపల్లి, తెల్లాపూర్, నాచారం, గండిపేట్, మియాపూర్, ఏఎస్‌రావునగర్, దుండిగల్‌తో పాటు తదితర ప్రాంతాల్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయన్నారు. ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనున్న ప్రాపర్టీ షోలో 100కు పైగా రియల్ ఎస్టేట్‌కు చెందిన సంస్థలు పాల్గొన్నాయి.
వినూత్న సంస్కరణలకు నిలయం
తెలంగాణ జైళ్ల శాఖ
తెలంగాణ జైళ్ల శాఖ వినూత్న సంస్కరణలకు నిలయమని, ట్రైనీ అధికారులు తెలంగాణ జైళ్ల శాఖ నుంచి స్ఫూర్తి పొందాలని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. శనివారం చర్లపల్లి సెంట్రల్ జైలులో నిర్వహించిన ట్రైనీ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వచ్చిన 131 మంది జైళ్ల శాఖ ట్రైనీ అధికారుల శిక్షణలో భాగంగా చర్లపల్లి సెంట్రల్ జైలును ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. శిక్ష కాలం ముగిసిన తర్వాత ఖైదీలు సమాజంలో సగర్వంగా జీవనం కొనసాగించేందుకు జైళ్లలో అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. చర్లపల్లి జైలు ఖైదీలు తయారు చేసిన ఎన్నో ఉత్పత్తులు మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు.ఇక జైలులో ఉన్న కిచెన్, పరిసరాలను సందర్శించిన సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ డా.జితేందర్, ఐజీపీ వై.రాజేశ్, హైదరాబాద్ రేంజ్ డిప్యూటీ డీఐజీలు మురళీబాబు, డాక్టర్ శ్రీనివాస్, చర్లపల్లి, చంచల్‌గూడ సూపరింటెండెంట్లు సంతోష్‌కుమార్ రాయ్, శివకుమార్ గౌడ్, కళాసాగర్, జిల్లా సబ్ జైళ్ల అధికారి రామచంద్రం, సిబ్బంది పాల్గొన్నారు.