అమీర్‌పేట్, అక్టోబర్ 29: రాష్ట్రంలో నర్సింగ్ కళాశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ద ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (టీఎన్‌ఎఐ) రాష్ట్ర రెండో బైనియల్ సదస్సు శనివారం సనత్‌నగర్‌లోని జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ నర్సింగ్ విభాగం ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రొ. బి.విద్యుల్లత, టీఎస్ఎన్ఎంఐసీ రిజిస్ట్రార్ బి.విద్యావతి, టీఎన్‌ఎఐ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ ఎం.రాజేశ్వరి, కార్యదర్శి టి.స్వరాజ్యవాణి, జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ సిస్టర్ బాంధవితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న 14 నర్సింగ్ కళాశాలలతో పాటు అదనంగా బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్ కళాశాలలను అభివృద్ధి చేస్తూ బీఎస్సీ, ఎంఎస్సీ స్థాయికి పెంచే దిశగా ప్రభుత్వ సమాలోచనలు చేస్తున్నదన్నారు. నర్సింగ్ విభాగానికి ప్రత్యేకంగా డైర్టెక్టరేట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉందని తెలిపారు. ఈ సదస్సులో టీఎన్‌ఎఐ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సంఘమిత్ర సావంత్, దక్షిణ ప్రాంత ఉపాధ్యక్షురాలు డాక్టర్ జెనీ కెంప్లతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.