నాంపల్లి, అక్టోబర్ 29: కాంట్రాక్టుల కోసం పదవిని అమ్ముకునే వారికి అభివృద్ధి గురించి పట్టదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి మళ్లీ గెలిచి అభివృద్ధి చేస్తానని మోకరిల్లినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. నమ్మి ఓటేస్తే వంచించే రాజగోపాల్‌రెడ్డికి ఓటుతోనే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మునుగోడులో టీఆర్ఎష్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ మండలంలోని పసునూరులో శనివారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన స్వార్థం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వాడు ప్రజాద్రోహి అవుతాడు తప్ప పాలకుడు కాలేడని విమర్శించారు. రూ.వేల కోట్ల కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరి ఉప ఎన్నికకు కారణమైన వాడు మళ్లీ ఊర్లలో తిరుగుతూ ఓట్లడుగుతుండడం సిగ్గు చేటని అన్నారు.
మరోసారి రాజగోపాల్‌రెడ్డి మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ అందాయని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఎలా ఓటు వేయాలని అవగాహన కల్పించారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తెలుగోటి వెంకటేశ్వరరెడ్డి, పోగుల వెంకటరెడ్డి, పోగుల విజయ, అబ్బాస్, మల్లారెడ్డి, దేపావత్ రవి పాల్గొన్నారు.