హైదరాబాద్‌ను అత్యంత నివాస యోగ్య నగరంగా మార్చే సంకల్పంతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో నగర నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఇప్పటివరకు కేవలం గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రాంగూడలకే పరిమితమైన ఎైత్తెన భవనాల సంస్కృతి మధ్య నగరానికి కూడా విస్తరించింది. విశ్వనగరంగా మారే దిశగా నానాటికీ విస్తరిస్తున్న జనావాసాల నిర్మాణాలలో నగరవాసుల అభిరుచులు మారుతున్నాయి. ఇరుకైన గదుల్లో నివాసం ఉండేకన్నా అపార్టుమెంటైనా సరే విశాల స్థలంలో అన్ని సౌకర్యాలతో సౌఖ్యంగా గడపాలనే ధోరణి పెరిగింది. ఈ నేపథ్యంలోనే నగరం నడిబొడ్డున కూడా ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా 40 అంతస్తుల ఎైత్తెన భవనాలు వెలుస్తున్నాయి. ఇటీవల ఆబిడ్స్‌లో నిర్మితమవుతున్న హైరైజ్ భవనం తరహాలోనే త్వరలోనే హుసేన్సాగర్ చుట్టూ భారీ భవంతులు రానున్నాయి.
సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): నానాటికీ విస్తరిస్తున్న విశ్వ నగరం.. హైదరాబాద్. ఒకప్పుడు చార్మినార్ చుట్టూ అల్లుకున్న జన సంద్రం… ఇంతితై! అన్నట్లు ఇప్పుడు వందల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఈ నేపథ్యంలో ప్రధాన నగరంలో (కోర్ సిటీ) స్థిరపడిన వారు విద్యా, వ్యాపార, ఉపాధి, సాంస్కృతిక అవకాశాల దృష్ట్యా శివారుకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు మారిన పరిస్థితులు, అభిరుచులకు అనుగుణంగా నివాస ప్రాంతాలను మరింత విస్తరించుకోవాలనే ఆలోచన. అందుకే హైదరాబాద్ నిర్మాణ రంగం ఇలాంటి వారి కోసం తన ట్రెండ్‌ను మార్చుకుంది. శివారు ప్రాంతాల్లోనే భారీ భవంతులు కాదు.. నగరం నడిబొడ్డున నింగికి నిచ్చెన వేసినట్లుగా ఆకాశహర్యాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం రెండు, అంతకంటే ఎక్కువ ప్లాట్లను జత చేసి భారీ భవనాలకు దరఖాస్తు చేసుకుంటున్న బిల్డర్ల సంఖ్య పెరుగుతున్నది. ఇటీవల అబిడ్స్‌లో 40 అంతస్తుల తరహాలోనే హుస్సేన్‌సాగర్ చుట్టూ భారీ భవంతులు రానున్నాయి.
నగరంలో గతంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించిన భవనాలు ఇప్పటి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా లేవన్నది నిజం. ముఖ్యంగా వ్యాపార వర్గాలు తమ వ్యాపారాలన్నీ ఇక్కడే ఉండటంతో కేవలం పెట్టుబడుల కోసం శివారు ప్రాంతాల భూముల వైపు చూస్తున్నారు. కానీ నివాసం కోసం అక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఉదాహరణకు.. అబిడ్స్, ఖైరతాబాద్ సర్కిళ్ల పరిధిలో అనేక వ్యాపార వర్గాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఉత్తరాది నుంచి ఇక్కడ స్థిరపడిన వారు ఎక్కువ. వ్యాపారరీత్యానే కాకుండా తమవారంతా ఇక్కడే ఉన్నందున వీరు ఇక్కడే నివాసం ఉండాలి. కొన్ని దశాబ్దాల కిందట నిర్మించిన గృహాలు ప్రస్తుతం అభిరుచులకు అనుగుణంగా లేవు. పైగా అవసరాలు కూడా పెరిగినందున విశాలమైన గృహాల్లో ఉండాలనుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే కొన్ని నిర్మాణ సంస్థలు ప్రత్యేకంగా కోర్ సిటీపై దృష్టిసారించాయి. గతంలోని నిర్మాణాలు ఉన్నప్పటికి వాటిని కొనుగోలు చేస్తున్నారు. 2-3వేల చదరపు గజాల కోసం రెండు, అంతకంటే ఎక్కువ ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. పాత నిర్మాణాలను పూర్తిగా తొలగించి.. కొత్తగా భారీ అపార్టుమెంట్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
రెండేళ్లలో 36 దరఖాస్తులు..
2020 నుంచి ఇప్పటివరకు కోర్ సిటీలో భారీ భవంతుల నిర్మాణం కోసం ఏకంగా 36 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 18 మీటర్ల పైబడిన ఆకాశహర్మ్యాలు ఏకంగా 12 వరకు ఉన్నాయి. ఇందులో భాగంగానే మీనాక్షీ నిర్మాణ సంస్థ ఎలీసియా అనే పేరుతో 40 అంతస్తుల భవన నిర్మాణ పనులు మొదలుపెట్టింది. మరోవైపు భారీ డిమాండు ఉన్నందున నిర్మాణ సంస్థలు కూడా తాము పెట్టిన పెట్టుబడి వెంటనే వస్తుందనే నమ్మకంతో మరిన్ని ప్రాజెక్టులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. కాకపోతే అనుకున్న స్థాయిలో స్థలాలు దొరకడంలేదని ఒక నిర్మాణ సంస్థ డైరెక్టర్ తెలిపారు.