మెహిదీపట్నం, అక్టోబర్ 28: ఏటీఎం కేంద్రాల వద్దకు వచ్చే వారి దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఆసిఫ్‌నగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షల నగదు, 115 ఏటీఎం కార్డులు, ఒక ఏటీఎం కార్డు స్వైపింగ్ మెషీన్, రెండు సెల్ఫోన్లు, ఫెవికాల్ గ్లో బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ ఆర్జీ. శివమారుతి, ఇన్స్పెక్టర్ సీహెచ్.శ్రీనివాస్ కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రం గయా జిల్లా తారవన్ ప్రాంతానికి చెందిన అతావుల్లాఖాన్ అలియాస్ అత్తా అలియాస్ డానిష్(28), సురేందర్ కుమార్ అలియాస్ మంటూ సింగ్(33) స్నేహితులు. వీరిద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి ఏటీఎం కేంద్రాల వద్ద దోపిడీకి స్కెచ్ వేశారు.
ఇలా దోచుకుంటారు..
ఏటీఎం సెంటర్‌కు వస్తున్న నిరక్షరాస్యులు, వృద్ధులను గమనిస్తారు. వారు డబ్బులు డ్రా చేసే సమయంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి.. సహాయం చేస్తామంటూ వస్తారు. అక్కడ బాధితుల నుంచి ఏటీఎం కార్డులు తీసుకొని డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ సమయంలోనే బాధితుల ఏటీఎం కార్డును దుండుగులు తీసుకొని.. దుండగుల వద్దనున్న పనిచేయని కార్డులను బాధితులకు ఇస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడి నుంచి ఇతర ఏటీఎం కేంద్రాలకు వెళ్లి బాధితుల ఏటీఎం కార్డు సహాయంతో డబ్బులు డ్రా చేసుకొని ఉడాయిస్తారు. కొన్నిసార్లు తమ వద్ద ఉన్న స్వైపింగ్ మెషీన్‌తో కూడా డబ్బులు డ్రా చేశారు. ఈ విధంగా ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, సైఫాబాద్, సుల్తాన్ బజార్, మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిద్దరూ 10 దొంగతనాలు చేశారు. ఈ మధ్య ఏటీఎం కేంద్రాల వద్ద జరుగుతున్న దోపిడీల నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఆసిఫ్‌నగర్ పోలీసులు శుక్రవారం మెహిదీపట్నంలో ఈ ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నదని పోలీసులు తెలిపారు.