సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): మెట్రో రైలు దిగగానే సమీపంలో ఉండే ఆఫీసుకో.., ఇంటికో.. త్వరగా చేరుకునేలా మెట్రోరైడ్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల సేవలను విస్తృతపరిచింది. మొదటి దశలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ప్రారంభించింది. నగరంలోని మెట్రో ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ ఉండటంతో ఈ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం హైటెక్ సిటీ, దుర్గం చెరువు, రాయదుర్గ మెట్రో స్టేషన్ల నుంచి చుట్టు పక్కల సుమారు 5 కి.మీ పరిధిలో ఉన్న వారికి మెట్రో రైడ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలను హెచ్ఎంఆర్ఎల్ ప్రాజెక్టు చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, ఎల్ అండ్ టీ మెట్రో చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ మురళీవరదరాజన్, మెట్రో రైడ్ సీటీఓ కమన్ అగర్వాల్, మెట్రో రైడ్ సీఈఓ, సహ వ్యవస్థాపకులు గిరీశ్ నాగ్‌పాల్‌తో కలిసి ప్రారంభించారు.
బేగంపేట మెట్రోపై సోలార్ ప్లాంట్
మెట్రో రైలు ద్వారా నిత్యం 4 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే మెట్రో రైడ్ సంస్థ ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా మెట్రో ప్రయాణికుల కోసం త్రిచక్ర, ద్వి చక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బేగంపేటలో నిర్మించిన మెట్రో భవన్‌పై సుమారు 200 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం ద్వారా 70శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. మొత్తం మెట్రో రైలు ప్రాజెక్టులో చాలా చోట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, అదంతా ఆయా స్టేషన్లు, ఇతర కార్యాలయాల్లోని అవసరాలకు వినియోగిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును గ్రీన్ మొబిలిటీ ప్రాజెక్టుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
– డీవీఎస్ రాజు, హెచ్ఎంఆర్ఎల్ ప్రాజెక్టు చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్
మెట్రో స్టేషన్ల నుంచి 200 ఎలక్ట్రిక్ వాహనాలు
హైదరాబాద్‌లో రోజువారి ప్రయాణికుల నుంచి వచ్చిన స్పందన మాకు మరింత ఉత్సాహానిచ్చింది. అదే ఉత్సాహంతో అత్యంత రద్దీ మెట్రో కారిడార్‌గా ఉన్న ఐటీ కారిడార్‌లోని మూడు మెట్రో స్టేషన్ల నుంచి మెట్రో రైడ్ సేవలను కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ప్రస్తుతం 35 ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉండగా, దశల వారీగా 4-5 నెలల్లో 200 ఎలక్ట్రిక్ త్రిచక్ర, ద్విచక్ర వాహనాలను తీసుకువస్తాం. ప్రస్తుతం రోజుకు 950 ట్రిప్పుల్లో మెట్రో ప్రయాణికుల కోసం తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ సేవలు అందిస్తున్నాయి. మెట్రో అధికారులు, షెల్ ఫౌండేషన్, డబ్ల్యుఆర్ఐ సంస్థ గ్రీన్ మొబిలిటీని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి.
– గిరీశ్ నాగ్‌పాల్, మెట్రో రైడ్ సీఈఓ, సహ వ్యవస్థాపకులు
మెట్రో రైడ్‌తో నెలకు రూ.2400 ఆదా..
ప్రతి రోజు నేను దిల్సుఖ్నగర్ నుంచి హైటెక్ సిటీకి ఉద్యోగం కోసం మెట్రోలో వెళ్తుంటాను. మెట్రో రైల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన ఆటోరిక్షాలు, ఎలక్ట్రిక్ బైకులతో మరింత వేగంగా ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, అక్కడి నుంచి మెట్రో రైలులో హైటెక్ సిటీకి వెళ్లి వస్తున్నాను. కేవలం 5 నిమిషాల్లో మెట్రో రైడ్ యాప్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనం ఇంటి వరకు వచ్చేది. అక్కడి నుంచి మెట్రోలో నిర్ణీత సమయంలో ఆఫీసుకు చేరుకుంటున్నాను. దీంతో నెలకు రూ.2400 ఆదా అవుతున్నది.
– జి.రత్నశ్రీ, ప్రయాణికురాలు