సుల్తాన్‌బజార్, అక్టోబర్ 28: ఎంజీబీఎస్ నుంచి సీబీఎస్ వరకు ప్రయాణికులను చేరవేసేందుకు ఆర్టీసీ ఏర్పాటుచేసిన ఉచిత బగ్గీ సేవలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయాణికుల సౌకర్యార్థం రెండు బగ్గీ వాహనాల సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రయాణికులకు ఊరట లభించింది. ఈ బగ్గీ సేవలు ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, ఈ రెండు వాహనాల ద్వారా సుమారు మూడు వేల మంది ప్రయాణికులను చేరవేస్తున్నామని ఎంజీబీఎస్ అసిస్టెంట్ మేనేజర్ సుధ పేర్కొన్నారు. ఈ వాహనాల సంఖ్యను పెంచేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
బగ్గీ సేవలు బాగున్నాయ్..!
బగ్గీ వాహనాల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించిన ఆర్టీసీకి కృతజ్ఞతలు. గతంలో లగేజీ తీసుకొని, పిల్లలతో సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌లోకి నడుచుకుంటూ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేది. ఇప్పుడు వారే ఉచితంగా బగ్గీ వాహనాల్లో తీసుకువెళ్లి ప్లాట్ఫారం వద్ద దిచేయడం సంతోషకరం.
– కొండల్, వరంగల్
ఇబ్బందులు తప్పాయి
గతంలో ఊర్లకు వెళ్లాలంటే సీబీఎస్ వద్ద దిగి ఎంజీబీఎస్‌లోని ప్లాట్ ఫారం వరకు నడిచేది. ఇప్పుడు ఆర్టీసీ బగ్గీ వాహనాల్లో ఉచితంగా చేరుకునే అవకాశం కల్పించింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలకు ఇబ్బందులు తప్పాయి.
– మధు, ఉప్పల్