సుల్తాన్‌బజార్, అక్టోబర్ 28: పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఎ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పారు. దక్కన్ పంచశైవ క్షేత్రాలు వేములవాడ (రాజరాజేశ్వర స్వామి), కాళేశ్వరం (ముక్తీశ్వర, కాళేశ్వరస్వామి), రామప్పగుడి (రామలింగేశ్వరస్వామి), వేయి స్థంభాల గుడి (రుద్రేశ్వరస్వామి), పాలకుర్తి (సోమనాథస్వామి)ల సందర్శనార్థం కార్తీక మాసంలో ప్రతి ఆదివారం, కార్తీక పౌర్ణమికి ముందు రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి దర్శనానంతరం సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటాయని వివరించారు. ఈ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు టికెట్ చార్జీ రూ.1,500 అని చెప్పారు. పంచరామాలు అయిన అమరావతి అమరుశ్వరాల యం, భీమవరం సోమేశ్వరాలయం, పాలకొల్లు క్షీరరామలింగేశ్వరాలయం, ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయం తదితర క్షేత్ర సందర్శనాలకు ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమికి ముందు రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి దర్శనానంతరం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాయని వెల్లడించారు.
ఈ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు టికెట్ చార్జీ రూ.2,540 ఉంటుందన్నారు. దర్శనం టికెట్ల కోసం, స్నాన, భోజన వసతి కోసం ముందుగానే బస్సులోనే చెల్లించాలని సూచించారు. కార్తిక మాసం సందర్భంగా శ్రీశైలంలో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు వివరించారు. ఈ ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. ప్రయాణికులు తమ సీట్లను ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లతో పాటు జంటనగరాల్లోని సమీప ఏటీబీ ఏజెంట్ల వద్ద, లేదా www.tsrtconline.inలో సీట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చని చెప్పారు. మరింత సమాచారం కోసం కస్టమర్ రిలేషన్స్ ఇన్చార్జి -9440566379, 7382838342, 9490261926, 6304802478, అసిస్టెంట్ మేనేజర్లు-9505462002, 9398641424, 9346559649, డిపో మేనేజర్లు- 9959226248, 9959226249, 9959226250, ఎంజీబీస్-9959226257, 9959224911 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.