సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వినియోగదారుల కమిషన్‌లో రాజీ పడటానికి ఆసారం ఉన్న కేసులను పరిషారం కోసం పంపాలని సిటీ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కన్నోజు మురళీమోహన్ సూచించారు. నవంబర్ 12న దేశవ్యాప్తంగా జరగనున్న మెగా జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం వినియోగదారుల కమిషన్ జిల్లా అధ్యక్షులు, సభ్యులతో కలిసి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిషారం విషయంపై చర్చించారు. రాజీపడేందుకు ముందుకొచ్చిన ఇరుపక్షాల వివరాలను న్యాయసేవా సంస్థకు నివేదిస్తున్నట్లు వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు తెలిపారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్‌కు పంపవచ్చునని మురళీమోహన్ సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ అధ్యక్షులు వకంటి నరసింహా రావు, ఎం.రాంగోపాల్‌రెడ్డి, సభ్యులు పారుపల్లి జవహర్ బాబు, సుమ, శ్రీదేవి, శ్యామల తదితరులు పాల్గొని వివిధ విషయాలపై చర్చించారు.
నిర్ణీత సమయంలో ఫ్లాట్ కట్టకపోతే నష్టపరిహారం చెల్లించాల్సిందే
చెన్నమనేని ఇన్ఫ్రాకు వినియోగదారుల కమిషన్ ఆదేశం
ఒప్పందం ప్రకారం నిర్దిష్ట వ్యవధిలో కొనుగోలుదారుకు ఫ్లాట్ కట్టి ఇవ్వనందుకు రూ.7.50లక్షలు వెనక్కి ఇచ్చేయాలని, అదేవిధంగా.. రూ.లక్షా 20వేల నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. బెంగళూరులో నివసించే గోపరాజు సంజయ్ ప్రైవేటు ఉద్యోగి. తార్నాకలోని చెన్నమనేని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఘట్కేసర్ మండలం కొర్రెముల పరిధిలోని వెంకటాపురంలో సర్వే నంబర్ 168, 198,199లో వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లో 15వందల చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ.15లక్షలకు 2014లో కొనుగోలు చేశారు. సేల్ అగ్రిమెంట్లో భాగంగా కొనుగోలుదారుడు రెండు దఫాలుగా రూ.7లక్షల 50వేలు చెన్నమనేని ఇన్ఫ్రా కంపెనీకి చెల్లించారు. కాగా, అగ్రిమెంట్ ప్రకారం 24నెలల్లో ఫ్లాట్ నిర్మాణం పూర్తిచేసి కొనుగోలుదారుడికి ఇవ్వాలి. అయితే, నిర్మాణం చేయడంలో సదరు కంపెనీ నిర్లక్ష్యం వహించింది. దీంతో కొనుగోలుదారుడు పలుమార్లు నిర్మాణ కంపెనీని సంప్రదించి విజ్ఞప్తి చేయగా స్పందించలేదు. దీంతో బాధితుడు నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసు పంపించారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు వినియోగదారుల కమిషన్‌లో కేసు వేశారు. హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ ఈ కేసును పరిశీలించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత రూ.7లక్షల 50వేలతో పాటు 18శాతం వడ్డీతో కలిపి వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. (కోర్టు ఖర్చులు, మానసిక వేదనకు గురిచేసినందుకు, నిర్లక్ష్యధోరణి ప్రదర్శించినందుకు) నష్టపరిహారం కింద రూ.లక్షా 20వేలు చెల్లించాలని పేర్కొన్నది. బెంచ్ ఆదేశాలను తీర్పు కాపీ అందిన 45 రోజుల్లోపు అమలు చేయాలని పేర్కొన్నది.