మేడ్చల్, అక్టోబర్ 28: పిల్లలు ఎదిగి, చదువులో ప్రతిభ చూపాలంటే పౌష్టికాహారం పాత్ర ప్రధానం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో దాదాపు అందరూ పేద విద్యార్థులే. వారి కుటుంబాలు పౌష్టికాహారానికి ఖర్చు చేయలేని పరిస్థితి. ప్రభుత్వం అందజేస్తున్న మధ్యాహ్న భోజనం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దానికి తోడు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అల్పహార రూపంలో అందజేస్తుంది. అందులో భాగంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను పౌష్టికాహారాన్ని అందజేస్తుంది.
రెండేండ్లుగా …
నగరానికి ఆనుకుని ఉన్న గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెండు ప్రాథమిక పాఠశాలలు, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. ఈ మూడు పాఠశాలల్లో కలిపి దాదాపు వెయ్యి మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు.రెండేండ్లుగా అక్షయ పాత్ర అల్పాహార రూపంలో వారికి రోజూ పౌష్టికాహారాన్ని అందజేస్తుంది.
అతి తక్కువ నూనె వాడుతూ విద్యార్థులు ఎదగడానికి అవసరమైన నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేస్తుంది. ఇడ్లీ, సేమ్యా ఉప్మా, పులిహోరా మజ్జిగ, టామటా బాత్, కిచిడీ, ఖారా, పల్లీలు తదితర ఆహార పదార్థాలను రెండేండ్లుగా అందజేస్తున్నారు. కరోనా సమయంలో పౌష్టికాహార కార్యక్రమానికి బ్రేక్ పడకుండా 35 వస్తువులతో ఆహార కిట్లను అందజేశారు.
చక్కటి చదువు కూడా..
ప్రభుత్వం అందజే స్తున్న మధ్యాహ్న భోజనం తో పాటు అక్షయపాత్ర ఫౌండేషన్ అల్పాహారాన్ని అందజేస్తుండటంతో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది.పాఠశాలల్లో పదో తరగతి చదివే పిల్లలకు ప్రత్యేక తరగతులు ఉన్నప్పుడు నైబర్హుడ్ గృహ సముదాయానికి చెందిన దాతలు సాయంత్రం పూట అల్పాహారాన్ని అందజేస్తున్నారు. ప్రభుత్వం, దాతల సహకారంతో పౌష్టికాహారం, నాణ్యమైన విద్య అందు తుండటంతో విద్యార్థుల నమోదు శాతం చాలా పెరిగింది. ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 500 మంది ఉన్నారు. చదువులో కూడా మంచి ప్రతిభ చూపుతున్నారు.
-రంగాచారి, ప్రధానోపాధ్యాయుడు, జడ్పీహెచ్ఎస్, గుండ్లపోచంపల్లి