మైలార్‌దేవ్‌పల్లి,అక్టోబర్28: శ్మశాన వాటిక అభివృద్ధికి అడ్డు వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కబ్జాదారులను హెచ్చరించారు. శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బెంగుళూర్ హైవే రోడ్డుపై ఉన్న నూర్ మహమ్మద్ కుంటలోని హిందూ శ్మశాన వాటికను పరిశీలించారు. స్థానిక నాయకుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి రూ. 6 లక్షల నిధులను మంజూరు చేయించి ప్రహరీ నిర్మిస్తున్నారు. కబ్జా దారులు రాత్రి సమయంలో ప్రహరీ పనులను కూల్చివేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ , ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు జీహెచ్ఎంసీ అధికారులతో శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. ఎవరు అడ్డువచ్చిన ప్రహరీ పనులు ఆపకుండా చూడాలని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ సీఐ మధును కోరారు. అక్కడ ఉన్న బహుళ అంతస్తుల నిర్మాణాలను ఆపివేయాలని అధికారులను ఆదేశించారు. శ్మశాన వాటికలో పనులను అడ్డుకుంటే సహించేది లేదని కబ్జా దారులను హెచ్చరించారు.
ఇక్కడ నిర్మించిన బహుళ అంతస్తుల స్థలంలో గతంలో చెరువు ఉండేదని ఎఫ్టీఎల్ పరిధిలో ఈ నిర్మాణాలు ఉన్నట్లయితే వెంటనే నోటీసులు జారీ చేయాలని తహసీల్దార్‌కు ఆదేశించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 40 ఏండ్లుగా చుట్టూ ఉన్న కాలనీ ప్రజలు శ్మశాన వాటికను ఉపయోగించుకుంటున్నారన్నారు. అప్పటి నుంచి ఎవరూ కూడా శ్మశాన వాటికలో తమ స్థలాలు ఉన్నాయని రాలేదని ఇప్పుడు రావడం సరికాదని అన్నారు. ఏదైనా డాక్యుమెంట్లు ఉంటే ఆర్డీవో , తహసీల్దార్‌కు చూపించాలన్నారు. అంతేగాని రాత్రి సమయంలో వచ్చి కూల్చివేతలు చేయడం సరికాదని హెచ్చరించారు. శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ నిర్మించి కబ్జా దారుల నుంచి కాపాడుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ నరేందర్‌గౌడ్ ,డీఈ శంకర్ ,ఏఈ బల్వంత్‌రెడ్డి,మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ మధు,బాబుల్‌రెడ్డి నగర్ నాయకులు ఎస్ వెంకటేశ్ సోమ శ్రీనివాస్, భగవాన్‌దాస్ ,మార్కండేయనగర్ ఉపాధ్యక్షుడు వర్కాల చందు,జగన్ తదితరులు పాల్గొన్నారు.