కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 28 : ఆస్తిపన్ను బకాయిదారులకు జీహెచ్ఎంసీ కల్పించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) మరో మూడు రోజుల్లో ముగియనున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీతో పాటు పలు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలలో ఆస్తిపన్ను బకాయిదారులకు ఊరట కల్పిస్తూ 90శాతం వడ్డీ రాయితీ అవకాశాన్ని కల్పించింది. ఏప్రిల్ 1నుంచి జూలై 16 మధ్య ఆస్తిపన్ను బకాయిలు వడ్డీతో సహా ఆస్తిపన్ను చెల్లిస్తే వారికి సైతం ఓటీఎస్ ఆఫర్‌ను వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ తరహాలో చెల్లించిన వారికి భవిష్యత్‌లో ఆస్తిపన్ను డిమాండ్‌లో సర్దుబాటు చేయనున్నారు. కాగా.. అక్టోబర్ 31లోగా మొండి బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌తో ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ రాయితీతో పాటు పెనాల్టీలను సైతం రద్దు చేయనున్నారు.
కూకట్పల్లి జోన్లో రూ.9.81 కోట్ల వసూళ్లు..
జీహెచ్ఎంసీ ప్రకటించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌లో కూకట్పల్లి జోన్లో మంచి స్పందన లభించింది. ఐదు సర్కిళ్లలో 7672 అసెస్మెంట్ ద్వారా రూ.9.81 కోట్ల బకాయిలను వసూళ్లు చేశారు. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే.. మూసాపేట సర్కిల్లో 1438 అసెస్మెంట్ల ద్వారా రూ.2.39 కోట్లు, కూకట్పల్లి సర్కిల్లో 1912 అసెస్మెంట్ల ద్వారా రూ.2.51 కోట్లు, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 2149 అసెస్మెంట్ల ద్వారా రూ.2.45 కోట్లు, గాజులరామారం సర్కిల్లో 1228 అసెస్మెంట్ల ద్వారా రూ.1.69 కోట్లు, అల్వాల్ సర్కిల్లో 945 అసెస్మెంట్ల ద్వారా రూ.0.78 కోట్ల బకాయిలను వసూళు చేశారు. 90శాతం వడ్డీ రాయితీ ఆఫర్ మరో మూడురోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఆయా సర్కిళ్ల పరిధిలో బకాయిదారులను ప్రత్యేకంగా కలుస్తూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది.
వందశాతం లక్ష్యంగా..
కూకట్పల్లి జోన్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని వందశాతం సాధించే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. జోన్‌లోని ఐదు సర్కిళ్లలో కలిపి ఆస్తిపన్ను వార్షిక యేడాది లక్ష్యం రూ.482.22 కోట్లు సాధించాల్సి ఉంది. ఇప్పటి వరకు జోన్ పరిధిలో రూ.192.4 కోట్లు వసూళ్లు కాగా ఇంకా రూ.293.13 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది. సర్కిళ్ల వారీగా వసూళ్లను పరిశీలిస్తే.. మూసాపేట సర్కిల్ లక్ష్యం రూ.141.3 కోట్లకు గాను రూ.70.59 కోట్లు వసూళ్లయ్యాయి. కూకట్పల్లి సర్కిల్ లక్ష్యం రూ.136.24 కోట్లకు గాను రూ.53.39 కోట్లు, కుత్బుల్లాపూర్ సర్కిల్ లక్ష్యం రూ.88.85 కోట్లకు గాను రూ.28.07 కోట్లు, గాజులరామారం సర్కిల్ లక్ష్యం రూ.57.97 కోట్లకు గాను రూ.19.59 కోట్లు, అల్వాల్ సర్కిల్ లక్ష్యం రూ.59.86 కోట్లు కాగా రూ.20.76 కోట్లు వసూళ్లు చేశారు. వార్షిక యేడాది ముగిసే లోగా మిగిలిన బకాయిలను వసూలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) ఆఫర్ ఈనెల 31తో ముగుస్తుంది. ఐదు సర్కిళ్ల పరిధిలోని బకాయిదారులంతా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే మొండి బకాయిదారులకు అవగాహన కల్పించగా కూకట్పల్లి జోన్లో రూ.9.81 కోట్లు వసూళ్లయ్యాయి. ఈ అవకాశం మరో మూడ్రోజులు మాత్రమే ఉంది. గడువు ముగిసిన తర్వాత మొండి బకాయిదారులను గుర్తించి వడ్డీతో సహా ఆస్తిపన్ను వసూళ్లు చేస్తాం. స్పందించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– వి.మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్