మియాపూర్, అక్టోబర్ 28 : ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ఎవరికి వారే కాకుండా ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అభివృద్ధి నిర్మాణ పనులలో రాజీ లేదని జాప్యం లేకుండా చూడాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జడ్సీ శంకరయ్య, డీసీ వెంకన్ననాయక్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సహా పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాలతో విప్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద నియోకవర్గంతో పాటు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు సైతం ఉన్నందున అభివృద్ధి నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులను చేపట్టాలని, చెరువుల సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని విప్ గాంధీ సూచించారు. అవసరమైన కొత్త పనులకు తగు ప్రతిపాదనలను రూపొందించాలని, నిధుల మంజూరుకు కృషి చేయాలని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించి నిధుల మంజూరయ్యేలా చూడాలని విప్ గాంధీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శంకర్, డీసీ వెంకన్న, ఈఈలు శ్రీకాంతిని, శ్రీనివాస్, ఏసీపీలు గణపతి, మెహ్రా, విశాల్, చంద్రారెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.
దివ్యాంగులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం కృషి..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో తమకు అవకాశం కల్పించాలని శేరిలింగంపల్లి దివ్యాంగుల పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో విప్ అరెకపూడి గాంధీని కోరారు. ఈ మేరకు ప్రతినిధులు విప్‌ను శుక్రవారం ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ డబుల్ బెడ్ ఇండ్లలో అర్హులైన దివ్యాంగులకు అవకాశం కల్పించే విషయమై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లి కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దివ్యాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. వారికి అండగా ఉండేలా ఆసరా పెన్షన్‌ను అందిస్తూ ఇంటికి పెద్ద కొడుకులా అండగా నిలుస్తున్నట్లు విప్ గాంధీ పేర్కొన్నారు. వైకల్యం శరీరానికే తప్ప కృషికి లక్ష్య సాధనకు కాదని, ఆత్మస్థయిర్యంతో ముందడుగు వేస్తున్న వారిని విప్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్, సమాఖ్య అధ్యక్షులు అశోక్, సర్దాజ్, సాగర్, సాగర్,లింగమ్మ, రేణుక, రాజేశ్వరి, నర్సింహులు, సతీష్‌కుమార్, తేజ పాల్గొన్నారు.