సుల్తాన్‌బజార్, అక్టోబర్ 28 : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో సైబర్ నేరాలు అధికమయ్యాయి. ఈ ఆన్లైన్ మోసాలను అరికట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు విన్నూత్న రీతిలో శ్రీకారం చుట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద మైకులను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ అనుసంధానంగా నేరాలకు ఎలా పాల్పడతారు.. ఎలా నిరోధించాలి ..అని ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. పెరుగుతున్న ఈ నేరాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు పోలీస్‌శాఖ తీసుకున్న నిర్ణయంతో అవగాహన కల్పించడంలో సఫలీకృతమవుతారని ఆశిస్తున్నారు. వాట్సాప్‌లలో గుర్తింపు లేని లింక్‌లు, మీ బ్యాంకు వివరాలు పూర్తి స్థాయిలో లేవని ఫోన్ల ద్వారా సమాచారం సేకరించడం, ఓఎల్ఎక్స్ వంటి యాప్ తక్కువ ధరకే వస్తువుల విక్రయాలు చేపడుతామని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతుంటారు. తమకు వచ్చి లింక్‌లకు స్పందించకుండా ఉండాలని, తాము బ్యాంకు అధికారులమని ఫోన్లో మాట్లాడినా.. వివరాలు తెలుపవద్దని అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రధాన కూడళ్లలో సిగ్నల్ పడిన సమయంలో మైకుల ద్వారా తెలిపే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా కమాండ్ కంట్రోల్ నుంచి కొనసాగుతుందని అధికారులు తెలుపుతున్నారు.
సైబర్ మోసాలకు గురి కావద్దు
సాంకేతికత సైబర్ నేరగాళ్లకు వరంగా మారిం ది. వాట్సాప్‌లో అనుమానిత, గుర్తింపు లేని లింక్‌లకు స్పందించవద్దు. లింక్ తెరిచిన సమయంలో ఓటీపీ అడుగుతుంది. అజాగ్రత్తగా ఉండి ఓటీపీ పంపిస్తే ఖాతా ఖాళీ కావడం ఖాయం. అనుమానిత నంబర్లతో ఫోన్ చేసి తాము బ్యాంకు అధికారులమని తెలిపితే ఖాతా వివరాలు తెలుపవద్దు. ఖాతా తెరిచిన బ్యాంకు వెళ్లాలి. ఆర్మీ అధికారుల ఐడీ కార్డులు చూపెట్టి నూతన తరహా మోసానికి పాల్పడుతున్న వారిపై జా గ్రత్తగా ఉండాలి. కమాండ్ కంట్రోల్ రూం నుంచి నగరంలోని ప్రధాన కూడళ్లలో మైకులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం.
– శ్రీనివాస్‌రావు, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్