అంబర్‌పేట, అక్టోబర్ 28: అంబర్‌పేట నియోజకవర్గంలో చేపట్టిన నాలా(ఎస్ఎన్డీపీ) పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. జీహెచ్ఎంసీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మహ్మద్ జియావుద్దీన్ నేతృత్వంలోని జీహెచ్ఎంసీ ప్రాజెక్టులు, నిర్వహణ, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో సమావేశమై ఆయా విభాగాలకు సంబంధించి అభివృద్ధి పనులపై గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా అంబర్‌పేటలోని మెయిన్ చెరువు నాలా, నల్లకుంట ఓల్డ్ రామాలయం వద్ద హెరిటేజ్ నాలా పనులు నత్తనడకన సాగుతున్నాయని, తద్వారా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సీఈ దృష్టికి తెచ్చారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అదే విధంగా నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణాలు కూడా మొదలు కాలేదని, వాటిని కూడా మొదలు పెట్టి పూర్తి చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్‌కు సంబంధించి చాలా ప్రాంతాల్లో టెండర్లు పూర్తయ్యాయని, అట్టి పనులు కూడా తొందరగా మొదలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. మూసారాంబాగ్ హైలెవెల్ బ్రిడ్జి, చాదర్‌ఘాట్ బ్రిడ్జి విషయాలను కూడా చర్చించారు. వానకాలం పూర్తయినందున రాబోయే మూడు నెలల్లో అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన సీఈ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే ఓల్డ్ రామాలయం వద్ద నాలాపై కప్పు నిర్మాణం పూర్తయిందని, మూడు, నాలుగు రోజుల్లో రాకపోకలకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.