గొల్ల కురుమల పరిస్థితి తెలంగాణ వచ్చినంక ఎట్ల బాగైందో ఒకసారి ఆలోచన చేయండి. రెండు విడతలుగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుచేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కులవృత్తులకు జీవం పోసి అక్కడ ఉండే వారి ఆర్థిక పరిపుష్టిని పెంచి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయడం. టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు జీవం పోస్తున్నది.ఈ క్రమంలోనే తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలను కలిపితే కేవలం 22,100 మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకం దారుల సొసైటీలో మెంబర్లుగా ఉండేది. ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 7లక్షల 61వేలకు చేరుకున్నది.. వాస్తవమా.. కాదా. అలాగే.. ఒక్కటి కాదు రెండు కాదు 11వేల కోట్లతో రెండు విడతలుగా గొర్రెల పంపిణీ చేసుకున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఒక్కటే. ఏకైక ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఒక్కరే.. అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని, సదరన్ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
తెలంగాణ రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ మంత్రులు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకం, 1962 అంబులెన్స్ పథకాలను చూసి కేంద్ర మంత్రులు పర్షోత్తమ్ రూపాల, గిరిరాజ్ సింఘ్, కర్ణాటక రాష్ట్ర ఫిషరీస్, షిప్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పండిత్రావులు ప్రశంసించారని గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పథకాలు నంబర్ వన్ అని, ఇలాంటి పథకాలు బీజేపీ ప్రభుత్వంలో లేవని మంత్రులు అన్నారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
చేసిన పనిని ఎవరైనా సరే గుర్తించక తప్పని పరిస్థితి ఉంటదని చెప్పేందుకు ఇదే తార్కాణమని తెలిపారు. గొర్ల కురమల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవని చెప్పారు. టాటాలు మాత్రమే కాదు మన తాతల నాటి కులవృత్తులు కూడా బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనేది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచనకనుగుణంగానే పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలబడి ఆశీర్వదించాలని గొర్ల కురుమలను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, నల్లగొండ డీసీఎంఎస్ చైర్మన్ జానయ్య యాదవ్, ఖమ్మం డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, ఎంపీపీ స్వామి యాదవ్, పాల్గొన్నారు.
రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంది. గొర్ల పంపిణీకి నగదును బదిలీ చేస్తే బీజేపీ నాయకులు కుట్రలు పన్ని.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి నగదును బ్యాంక్‌లలో ఫ్రీజ్ చేయించారు. ఎన్నికల అనంతరం గొల్ల, కురుమలు నగదు పొందవచ్చు. బీజేపీ కుట్రలను తిప్పికొడుతూ మునుగోడు ఎన్నికల్లో గొల్ల, కురుమలు సత్తా చాటాలి.
-బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్యే కోదాడ
రాష్ట్రంలోని గొల్ల, కురుమల కుటుంబాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. రెండు విడుతల గొర్రెల పంపిణీకి రూ.12వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. రాష్ట్రంలోని గొల్ల, కురుమలందరూ టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ఉంటారు. -జైపాల్ యాదవ్, ఎమ్మెల్యే కల్వకుర్తి
గొల్ల, కురుమలకు గొర్ల పంపిణీ కోసం నగదును బదిలీ చేస్తే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి నిలిపివేయించిన బీజేపీ అభ్యర్థికి గొల్ల, కురుమలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది. గొల్ల, కురుమలకు 10 ఎకరాల్లో స్థలం కేటాయించి 10 కోట్లతో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గొల్ల, కురుమలు ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి అంటే గొల్ల, కురుమలు టీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవాలి.
-యెగ్గె మల్లేశం, ఎమ్మెల్సీ
తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. కేవలం గొల్ల, కురుమలకు రైతుబంధు కింద 1510 కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌ది. గొర్ల పంపిణీ పథకం ద్వారా రూ.12వేల కోట్లను అందించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా మూగజీవాలకు వైద్యం అందించడానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించారు.
– దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్,
షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
రాష్ట్రంలో గొల్ల, కురుమల కష్టాలను ఎరిగి వారిని గుర్తించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్. గొల్ల, కురుమలకు ఆర్థిక చేయూతను అందించడమేగాకుండా, రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌కు మద్దతుగా గొల్ల, కురుమలు ఉంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్లను పంపిణీ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.
– కొత్తకుర్మ సత్తయ్య, డీసీసీబీ వైస్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా
రాష్ట్రంలోని గొల్ల, కురుమలు తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉన్నారు. అడిగితే తప్ప పథకాలు అమలు చేయని నాటి నాయకులు అడగకుండానే పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్‌ను చూసి గుణపాఠం నేర్చుకోవాలి. గొల్ల, కురుమ సోదరులకు ఆర్థిక చేయూతను అందించడానికి సీఎం కేసీఆర్ గొర్ల పంపిణీ పథకం చేపట్టారు. ఈ పథకం లక్షల గొల్ల, కురుమ కుటుంబాల్లో వెలుగులు నింపింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.
– గుండెబోయిన అయోధ్య యాదవ్, యాదవ సంఘం అధ్యక్షుడు, యాదాద్రి జిల్లా
ప్రజా శ్రేయస్సు అవసరం లేని బీజేపీ నాయకులు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్తోనే తమ పోటీ అని చెప్పుకోవడం హాస్యాస్పదం. 18వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయిన వ్యక్తికి ప్రజలు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయం. రాష్ట్రంలోని గొల్ల, కురుమలను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గొల్ల, కురుమలు ఉంటారు. బలహీన వర్గాలను రాజ్యసభకు పంపిన ఘనత దేశంలో సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.
-బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ రాజ్యసభ
గొల్ల, కురుమల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా రెండవ విడత గొర్రెల పంపిణీలో భాగంగా ప్రభుత్వం నగదును బదిలీ చేస్తే గొల్ల, కురుమల అభ్యున్నతిని ఓర్వలేని బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఆపించారు. ఇది బీజేపీ ప్రభుత్వ దాష్టికానికి నిదర్శనం. తెలంగాణలో మాదిరిగా దేశ వ్యాప్తంగా గొర్ల పంపిణీ జరగాలంటే దేశానికి సీఎం కేసీఆర్ నేతృత్వం అవసరం ఉంది. -నోముల భగత్, ఎమ్మెల్యే నాగార్జున సాగర్