గ్రేటర్లో సదర్ సందడి నెలకొన్నది. యాదవ, కురుమ సంఘం ఆధ్వర్యంలో పలు చోట్ల సదర్ ఉత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. భాజా భజంత్రీలు, డీజే సౌండ్ల మధ్య దున్నపోతుల విన్యాసాలు, యాదవుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ అన్నపూర్ణ ఎన్క్లేవ్, మాదాపూర్ గుట్టల బేగంపేట, మేడ్చల్, ఖైరతాబాద్‌లో సదర్ ఉత్సవాలు సాగాయి. దున్నపోతుల విన్యాసాలను తిలకించేందుకు చుట్టు ప్రక్కల జనాలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, టీఆర్ఎస్ నేత మర్రి నర్సింహ రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
– మేడ్చల్/కొండాపూర్/బొల్లారం, అక్టోబర్ 26
ఖైరతాబాద్, అక్టోబర్ 26 : చౌదరీ యాదయ్య యాదవ్ బ్రదర్స్, నవయుగ యాదవ సంఘం సంయుక్తాధ్వర్యంలో బుధవారం రాత్రి ఖైరతాబాద్‌లో నిర్వహించిన సదరోత్సవం సందడిగా సాగింది. ఈ వేడుకను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 70 సంవత్సరాల నుంచి ఈ వేడుకలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ వేడుకల్లో యాదవులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారని చెప్పారు. నిర్వహకుల కోరిక మేరకు సదరోత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించడంతో పాటు జీవో సైతం జారీ చేయాలని ఆదేశించారన్నారు. వచ్చే ఏడాది నుంచి సదర్ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారన్నారు. ఈవేడుకల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఉత్సవాల నిర్వాహకులు మంగళారపు మహేశ్‌యాదవ్, చౌదరి యాదయ్య యాదవ్, మధుకర్‌యాదవ్, లక్ష్మణ్ యాదవ్, భవానీ కృష్ణ యాదవ్, వినోద్ యాదవ్, సుధాకర్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్, మహేందర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్‌లో జరిగిన సదరోత్సవంలో దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తొలుత గోవు పూజ నిర్వహించి అనంతరం దున్నపోతుతో ఖైరతాబాద్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సదర్‌ను తొక్కించి ర్యాలీని ప్రారంభించారు. వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన దున్నపోతులతో నిర్వహించిన ర్యాలీ విశేషంగా ఆకట్టుకున్నది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు దున్నపోతులకు పతాకాలు కట్టి, నిర్వాహకులను శాలువాలతో మంత్రి సత్కరించారు.