నేరేడ్మెట్, అక్టోబర్ 26 : నేరేడ్మెట్ జేజేనగర్లో ఉన్న గ్రేస్ అనాథాశ్రమంలో బాలికపై లైంగిక దాడి జరిగింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆశ్రమం అకౌంటెంట్ మురళితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ నర్సింహాస్వామి బుధవారం వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఆశ్రమం నుంచి నలుగురు యువతులు కనిపించకుండా పోయారంటూ నిర్వాహకులు ఈనెల 19న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ నలుగురిలో ఒకరు మేజర్ కాగా, మరో ముగ్గురు మైనర్లు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తప్పిపోయిన వారిలో ఇద్దరిని సికింద్రాబాద్‌లో, మరో ఇద్దరిని సంగారెడ్డిలోని బంధువుల ఇంటి వద్ద గుర్తించి సఖి సెంటర్‌కు తరలించారు.
వీరిలో ఓ బాలిక తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని ‘సఖి’ నిర్వాహకులకు తెలియజేసింది. ఆశ్రమంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న మురళి లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. బాలిక, కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నేరేడ్మెట్కు చెందిన మురళి(27), సంగారెడ్డికి చెందిన గణేశ్‌ను అరెస్టు చేశారు. వీరిద్దరిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, నిర్వాహకులపై జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఒకరిపై ఆశ్రమంలో లైంగికదాడి జరుగగా.. మరొకరిపై సంగారెడ్డిలో జరిగినట్టు తెలుస్తున్నదని, ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహాస్వామి తెలిపారు.
నేరేడ్మెట్ జేజేనగర్‌లోని గ్రేస్ అనాథాశ్రమంలో 36 మంది అనాథ బాలికలు, యువతులకు వసతి కల్పిస్తున్నారు. ఈనెల 19న ఉదయం అనాథాశ్రమం నుంచి ఒక మేజర్, ముగ్గురు మైనర్లు పారిపోయారు. మేజర్, మరో బాలిక కలిసి సంగారెడ్డికి వెళ్లి.. అక్కడ మేజర్‌కు తెలిసిన ఒకరి ఇంట్లో తలదాచుకున్నారు. మిగతా ఇద్దరు బాలికలు మాత్రం సికింద్రాబాద్‌లోనే ఉండిపోయారు. ఎటు వెళ్లాలో తెలియని ఆ చిన్నారులు తిరిగి అనాథాశ్రమానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ, సఖి కేంద్రం ప్రతినిధులు బాలికలతో ప్రత్యేకంగా మాట్లాడారు. పారిపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. తమపై లైంగిక దాడి జరిగిందంటూ ఇద్దరు బాలికలు చెప్పారు. సంగారెడ్డిలో ఉన్న మేజర్, మరో బాలికను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. మేము పారిపోవడానికి కారణం అకౌంటెంట్ మురళి అంటూ.. బాధిత బాలికలు సఖి కేంద్రం అధికారులకు వెల్లడించారు.