ఖైరతాబాద్, అక్టోబర్ 23 : దీపావళి తర్వాతి రోజు జరుపుకునే సదర్ వేడుకలు ఖైరతాబాద్ నుంచే ప్రారంభమవుతాయి. ఖైరతాబాద్ సదర్ వేడుకలకు 70 వసంతాలు దాటాయి. ప్రస్తుతం దివంగత శివలాల్ యాదవ్, చౌదరి సత్తయ్య యాదవ్ వారసత్వాన్ని ఆయన వారసులు కొనసాగిస్తూ వస్తున్నారు. రెండు సంవత్సరాలుగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడిన తరుణంలో ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు ఆదివారం ఖైరతాబాద్‌లోని మహంకాళి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను ప్రధాన నిర్వాహకులు మంగళారపు మహేశ్ యాదవ్, మధుకర్ యాదవ్‌లు వెల్లడించారు. ఈ ఏడాది చౌదరి యాదయ్య యాదవ్ బ్రదర్స్, నవయుగ యాదవ సంఘం సంయుక్తాధ్వర్యంలో సదర్ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ఖైరతాబాద్, నాంపల్లి, చింతలబస్తీ, పంజాగుట్ట తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 దున్నపోతులను తరలిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బడా గణేశ్ నుంచి రైల్వే గేటు వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె.ప్రసన్నరామ్మూర్తి హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో చౌదరి యాదయ్య యాదవ్, మంగళారపు లక్ష్మణ్ యాదవ్, ఆంజనేయులు, రాజా యాదవ్, సుధాకర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, పాల్గొన్నారు.