ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 23: అనుమానాస్పద స్థ్ధితిలో ఓ యువకుడి మృతి చెందిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో జరిగింది. ఇన్స్పెక్టర్ వి.అశోక్ రెడ్డి కథనం ప్రకారం… పోలీసు స్టేషన్ పరిధి పోచారం మున్సిపాలిటీ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్న అర్రలక్ష్మి కుమారుడు నరేశ్(29) ఎలక్ట్రిషన్‌గా పని చేస్తుంటాడు. శనివారం తన మిత్రుడది జన్మదిన వేడుకలకు వెళుతున్నట్లు తల్లితో చెప్పి బయటకు వెళ్లాడు. తెల్లవారు జామున రాజీవ్ గృహకల్ప కాలనీలోని 18వ బ్లాక్ ముందు పడి ఉన్నట్లు తల్లికి సమాచారం రావటంతో ఆమె అక్కడికి వెళ్లి చూడగా తలకు తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడ్డాడా, మరే ఇతర కారణం వల్లా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.