సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను మల్కాజిగిరి జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.27,400 నగదు, మూడు సెల్ఫోన్లు, షిఫ్ట్ డిజైర్ కారు, ఏటీఎం కార్డులు, మనపురం గోల్డ్ హామీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌కు చెందిన మడగాని యాకయ్య అలియాస్ యాక (19), బండ రాహుల్(20), జోగి దేవేందర్ అలియాస్ శ్రీకాంత్ , నల్గొండ జిల్లాకు చెందిన కందికంట్ల అభిరామ్ ఈనెల 19న మధ్యాహ్నం వలిగొండ మండలం గోకారం గ్రామానికి చేరుకున్నారు. గ్రామ శివారు ప్రాంతంలో కారు నిలిపి, అటుగా వెళ్తున్న ప్రమీల అనే మహిళ కండ్లలో కారం చల్లారు. అనంతరం సదరు మహిళ మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని కారులో పరారయ్యారు. దీంతో బాధితురాలు ఈనెల 21న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి, శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు, కారు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు.