బేగంపేట్, అక్టోబర్ 22: యాదవులు, కుర్మలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద ఈ నెల 26న మన్నెగూడలోని బీఎంఆర్ సార్థ కన్వెన్షన్‌లో జరిగే యాదవ, కుర్మల ఆత్మీయ సమ్మేళనం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం యాదవ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జనాభా పరంగా యాదవులు, కుర్మలు పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. ఉమ్మడిపాలనలో యాదవ, కుర్మలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు రాజకీయంగా పెద్ద పీట వేశారని చెప్పారు.
అలాగే ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో 11 వేల కోట్ల రూపాయలతో సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గొర్రెల యూనిట్ లబ్ధిదారులకు పైలెట్ ప్రాజెక్ట్‌గా నగదు బదిలీని చేపడితే బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి నిలిపివేయించారని ఆరోపించారు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. యాదవులు, కుర్మలు ఐక్యతను చాటి చెప్పేందుకు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్యాదవ్, కార్పొరేటర్ వెంకటేశ్, యాదవ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టెపు జానయ్య, నాయకులు శ్రీనివాస్, బోయిన సుధాకర్, కడారి అంజయ్య, ఐలేశ్ యాదవ్, రాజారం పాల్గొన్నారు.
నేడే గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనాన్ని రంగారెడ్డి జిల్లా మన్నేగూడలోని బీఎంఆర్ సార్థ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, వి. శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. నేడు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి గౌడ కులస్తులందరూ రావాలని కల్లు గీత కార్మిక సంఘం పిలుపునిచ్చింది.