ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని, చేనేతల సంక్షేమ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడలో నిర్వహించిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో చేనేత కార్మికులకు ముడిసరుకుపై 40% రాయితీ ఇస్తుంటే.. మోదీ మాత్రం.. 5 శాతం జీఎస్టీ విధించారని మండిపడ్డారు. 5 శాతం జీఎస్టీని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, పవర్లూమ్, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో “చేనేత ప్రభుత్వం” అధికారంలో ఉన్నదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేనేతలకు ఉరితాళ్లు మిగుల్చుతున్నదని తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడ బీఎంఆర్ సార్థ ఫంక్షన్ హాల్లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్‌లను మంత్రి కేటీఆర్ సన్మానించారు.
అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. చేనేతకు చేయూతనిచ్చేందుకే కేసీఆర్ చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. కోకాపేటలో ఖరీదైన స్థలాన్ని పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి ఇచ్చామని, త్వరలోనే ఈ భవన నిర్మాణాన్ని పూర్తిచేసి అప్పగిస్తామని తెలిపారు. చేనేత కార్మికుడికి సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు ఇస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వం అయితే నేతన్నల కోసం పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత నేత కార్మికుల పైన ఉన్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అసత్యాలను నమ్మితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైక్స్‌టైల్ రంగం కుదేలవుతున్నదని, చేనేత కార్మికులు మళ్లీ తిండికి అవస్థలు పడే రోజులు వచ్చే ప్రమాదమున్నదని గుర్తుచేశారు.
ఎమ్మెల్సీ ఎల్.రమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, చెరుకుపల్లి సీతారాములు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఆలిండియా పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, పద్మశ్రీ చింతకింది మల్లేశం, గజం గోవర్దన్, గజం అంజన్న, జి.మార్కండేయ, కర్నాటి విద్యాసాగర్, డాక్టర్ కర్నాటి శ్రీనివాస్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ చాగంట్ల నరేంద్రనాథ్, బోళ్ల శివశంకర్, కర్నాటి వెంకటేశం, సాంబారి సమ్మారావు, మాజీ జడ్పీ చైర్మన్ మచ్చా సుధాకర్, రాపోలు సుధాకర్, గుండు ప్రభాకర్, గడ్డం జగన్నాథం, జి.యాదగిరి, బూర మల్లేశం, రమేశ్, కందగట్ల భిక్షపతి, బాలు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
“ఏమైనా మార్పులుంటే చెప్పండి చేస్తాం. ఇది మీ ప్రభుత్వం.. మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. మీరిస్తేనే మాకీ పదవులు.. అందుకే నేతన్నకు చేయూతలో మార్పులుంటే సూచించండి. చేసే బాధ్యత నాదే” అని పేర్కొన్నారు. ఎవరైనా నేత కార్మికుడు దురదృష్టవశాత్తు చనిపోతే వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయలను వారి కుటుంబాలకు అందజేస్తున్నామని, ఇప్పటికే 40వేలకు పైగా కార్మికులు ఈ కార్యక్రమంలో చేరారని చెప్పారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వెంటనే చేరాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మీరు ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
మనం కొత్త పథకాలు, కార్యక్రమాలు తీసుకొస్తుంటే.. కేంద్రం మాత్రం ఉన్నవన్నీ రద్దు చేస్తున్నదని మండిపడ్డారు. గతంలో 14 మంది ప్రధాన మంత్రులు చేయని దుర్మార్గాన్ని నరేంద్ర మోదీ చేస్తున్నారని తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారి చేనేతలపై 5 శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని దుయ్యబట్టారు.
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఇరువురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కల్పించినందుకు కృతజ్ఞతలు. పద్మశాలి భవన నిర్మాణానికి 2.5 ఎకరాల స్థలాన్ని, నిధులను కేటాయించినందుకు ధన్యవాదాలు. చితికిపోయిన చేనేత కార్మికుల ఇతర అవసరాలను గుర్తించి పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందించారు.
– కందగట్ల స్వామి, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు.
చేనేత కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగాన్ని అన్ని విధాల ప్రోత్సహిస్తున్నారు. పద్మశాలి బిడ్డలకు కార్పొరేషన్ పదవులు కల్పించారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. త్రిఫ్ట్ ఫండ్ పథకంతో చేనేత, పవర్‌లూం కార్మికులను ఆదుకున్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక సహాయం అందించారు. నూలుపై సబ్సిడీని తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం వ్యవహరిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత బిడ్డలకు అండగా నిలిచింది. చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత బీమా ప్రకటించారు.
– గుండు సుధారాణి, వరంగల్ మేయర్
రాబోయే ఎన్నికల్లో పద్మశాలీలకు, పద్మశాలి మహిళలకు సీట్లు కేటాయించాలి. అఖిల భారత పద్మశాలి మహిళా సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి. ప్రపంచానికి నాగరికత నేర్పిన చేనేతకు ‘చేనేత బంధు’ ప్రవేశపెట్టాలి. పద్మశాలీలకు రెండు కార్పొరేషన్ పదవులు కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– వనం దుశ్యంతల, అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు
చేనేత కార్మికుల సంక్షేమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉంది. త్రిఫ్ట్ పథకం ద్వారా నేత, చేనేత కార్మిక కుటుంబాల భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసిన మొత్తానికి రెండు రెట్లు జమచేసిన మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్. కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ రూపంలో పన్ను వసూలు చేయడాన్ని తక్షణమే ఎత్తివేయాలి. చేనేత అభివృద్ధి బోర్డును రద్దు చేయడం దారుణం. హస్తకళల బోర్డును రద్దు చేసి చేనేత కార్మికులను దెబ్బతీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేనేత వస్ర్తాలను ధరించి చేనేతకు విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా వ్యాపారం పెరిగింది. చేనేత సంక్షేమం కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్కు మునుగోడు ఎన్నికల్లో పద్మశాలీలు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం.
– అవ్వారి భాస్కర్, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. చేనేత కార్మికుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ చేనేత రంగానికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. జనరల్ స్థానంలో వరంగల్ మేయర్‌గా పద్మశాలి ఆడబిడ్డకు అవకాశం కల్పించారు. చేనేత కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. చేనేత, జౌలి శాఖ మంత్రిగా ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరించాలని పిలుపునివ్వడమే కాకుండా, దానిని ఆచరిస్తున్నారు. ఈ సంప్రదాయం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇది తెలంగాణకు ఎంతో గర్వకారణం. అన్ని విధాలుగా చేనేత బిడ్డలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి పద్మశాలి కులస్తులు ఎల్లప్పుడూ అండగా ఉండాలి. చేనేతల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ఉండాలి.
– మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎల్.రమణ
ఇరువురు పద్మశాలీలకు కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు. దేశంలో పద్మశాలీల సంక్షేమం గురించి ఆలోచించే నాయకత్వం ఉండటం అదృష్టం. నేత కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.70 కోట్లు ఉన్న బడ్జెట్‌ను రూ.1200 కోట్లకు సీఎం కేసీఆర్ పెంచారు. బతుకమ్మ చీరల ఆర్డర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల నేత కార్మకుల జీవితాల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు మంత్రి కేటీఆర్ చూపు నల్లగొండ జిల్లా చేనేత కార్మికుల వైపు ఉంది. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూ అనేక పథకాలను తొలగించింది. 59 సంవత్సరాలు నిండిన నేతన్నలకు రైతు బీమా మాదిరిగా నేతన్న బీమా కల్పించాలి.
– గూడూరు ప్రవీణ్, పవర్‌లూం, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
హ్యాండ్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు. రోజురోజుకు చేనేత రంగంలో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ.. సీఎం కేసీఆర్ తానున్నానంటూ భరోసా కల్పించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్ వద్ద ఎన్నో వ్యూహాలున్నాయి. చేనేత రంగానికి అన్ని విధాల సహకరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి పద్మశాలీలు అందరూ అండగా ఉండాల్సిన అవసరమున్నది.
– చింత ప్రభాకర్, హ్యాండ్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్