మియాపూర్,మాదాపూర్ అక్టోబర్ 21 : కోట్లాది రూపాయలతో సకల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అభివృద్ధిలో శేరిలింగంపల్లి నియోజకవర్గం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి, ఆస్బెస్టాస్ కాలనీ, దీనబంధు , ప్రగతీనగర్, పాపారాయుడునగర్, హనుమాన్ నగర్లలో రూ. 2,17,05,000 నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, యూజీడీ పనులకు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి విప్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కూకట్పల్లి డివిజన్ సగభాగం అయినప్పటికీ అభివృద్ధి విషయంలో అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సహా ఇతర పూర్తి స్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల తోడ్పాటుతో అధిక నిధులను సమకూర్చుకుంటూ ప్రజా సౌకర్యం కోసం విస్తృతమైన అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. రాబోయే రోజులలో మరిన్ని పనులతో ప్రతి డివిజన్ నగరానికే ఆదర్శంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని విప్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, చంద్రారెడ్డి, నాగేశ్వర్రావు, ఎల్లం నాయుడు, ఇబ్రహీం, శ్రీధర్‌రెడ్డి, కనకకారెడ్డి, భగవంత్‌రెడ్డి, నర్సింహులు, భూలక్ష్మీ, పద్మ, శ్రీజ్యోతి, లావణ్య, కవిత, లీల తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్ డివిజన్లోని గోకుల్ ప్లాట్స్‌కు చెందిన టీడీపీకి చెందిన పలువురు పార్టీ నేతలు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో విప్ గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌ల సమక్షంలో బీఆర్ఎస్(టీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. విభిన్న సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ఏకైక సీఎంగా దేశంలోనే గుర్తింపు పొందారన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వేర్వేరు పార్టీలలో ఉన్న నేతలంతా తిరిగి సొంత గూటికి చేరుతున్నారని, ప్రభుత్వం ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుండటమే ఇందుకు కారణమని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రాజుయాదవ్, శ్రీను, రాబిన్, సైదేశ్వర్రావు, శ్రీనివాస్‌తో పాటు పార్టీలో చేరిన వసంత్, ప్రసాద్, సాయి, శ్రీకాంత్, అశోక్, జగదీశ్ తదితరులున్నారు.