ఆర్కేపురం, అక్టోబర్ 21 : విక్టోరియా మెమోరియల్ హోం ట్రస్ట్ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అందులో ఎటువంటి సందేహాలకు, అపోహలకు తావులేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. వీఎం హోం గ్రౌండ్స్‌లో వాకర్స్, పోలీస్ ట్రైనింగ్ అభ్యర్థుల విషయంతో తలెత్తిన వివాదంపై శుక్రవారం వీఎం హోం పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులతో ఎమ్మెల్యే చర్యలు జరిపారు. ఈ సందర్భంగా వీఎం హోం నిర్వాహకులు, పూర్వ విద్యార్థులు అనేక అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పేద, మధ్య తరగతి పిల్లలు నగరంలోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు.
వేల మంది పోలీస్ ట్రైనింగ్ అభ్యర్థులు ఉన్నారని, కేవలం 45 రోజులు మాత్రమే వారు శారీరకదారుఢ్యం, రన్నింగ్, లాంగ్‌జంప్ కోసం గ్రౌండ్‌ను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో వాకర్స్‌ను కూడా పోలీస్ శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులకు మద్దతు తెలిపారని చెప్పారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణమాలకు వీఎం హోం నిర్వాహకురాలైన లక్ష్మీపార్వతి కారణమని, అటు మంత్రిని, ఇటు పూర్వ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని, పోలీస్ శిక్షణ తీసుకుంటున్న వారికి అనుమతి ఇవ్వాలని కోరారు.
వీఎం హోంలోనే కాకుండా సరూర్‌నగర్ స్టేడియం, రైతు బజార్ వెనుకాల స్థలంలో, మలక్‌పేట ఇలా అక్కడక్కడ కొంత మందికి వసతి కల్పించడం జరిగిందన్నారు. అయినా.. ఇంకా చాలా మంది రోడ్లపైనే ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదనే ఉద్దేశంతోనే మట్టితో ఉన్న గ్రౌండ్స్‌లో వసతి కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీఎం హోంలో సీఎం కేసీఆర్ అనాథ పిల్లల పాలసీలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో వేసిన కమిటీ వీఎం హోంను అనాథ విద్యార్థుల కోసం కేజీ టూ పీజీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి , బేర బాలకిషన్, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు మహేశ్ గౌడ్, రాము, రాజు, సాగర్, సాయి, రాజు, రవి తదితరులు ఉన్నారు.