మేడ్చల్, అక్టోబర్ 21 : మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. అంకిత భావంతో వృత్తిని నిర్వహించి, సమాజ భద్రతకు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని, ప్రజలు రక్షణగా నిలవడమే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు మురళీధర్, రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.
శామీర్‌పేట, అక్టోబర్ 21:పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని సీఐ సుధీర్‌కుమార్, జగ్గంగూడ సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శామీర్‌పేట పోలీసులు-దాతలు ఎం.రాఘవేందర్‌రెడ్డి, ఐనంపూడి సునీతరాజు సంయుక్తంగా జగ్గంగూడలోని డిసబుల్ హోమ్, మసీద్‌లో జాయ్ ఆఫ్ గివింగ్లో భాగంగా శుక్రవారం భోజనం, పండ్లు, 50కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ముందుగా సీఐ సుధీర్‌కుమార్ నేతృత్వంలో సిబ్బంది, పలు రాజకీయ పార్టీల నేతలు పోలీసు అమరవీరుల సంస్మరణలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్‌రెడ్డి, శామీర్‌పేట ఎస్ఐ వీరశేఖర్, ఖాన్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ నాగరాజుగుప్తా, వైవి.రమణారెడ్డి, ఎం.లక్ష్మణ్‌కుమార్, కే.కల్యాణి, జీ.కృష్ణారెడ్డి, నర్సింహ, నరేందర్‌రెడ్డి, రవికాంత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 21 : విద్యార్థులకు బాల్య దశ నుంచే పోలీస్ వ్యవస్థ, ఆయుధాలపై అవగాహన అవసరమని ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ వి.అశోక్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీచంద్ర హైస్కూల్ విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుల స్వీకరణ నుంచి ఆయుధాలు, సెల్, కేసుల నమోదు వివరాలను తెలియజేశారు. ఆయుధాలు భద్రపరిచే గదితో పాటు ఆయుధాలను వినియోగించే విధానాన్ని చూపించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఇన్స్పెక్టర్ జంగయ్య, అడ్మిన్ ఎస్సై నాగార్జున రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, అక్టోబర్ 21 : పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐ గోవర్ధనగిరి ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులకు పోలీస్‌స్టేషన్ నిర్వహణ, ఆయుధాల వినియోగం, ఫిర్యాదును ఎలా స్వీకరిస్తారు.. దానిపై దర్యాప్తు ఎలా కొనసాగిస్తారు.. సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి.. వాటిని నిరోధించడం ఎలా, వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలతో పాటు చైల్డ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ చట్టం గురించి తెలుకోవాలని, దేశ రక్షణకు సైన్యం, పోలీస్ శాఖలో పని చేయడానికి ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై కృష్ణ, అకాడమిక్ హైట్స్ పాఠశాల విద్యార్థులు సుమారు వంద మంది పాల్గొన్నారు.