సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరం అద్భుత నిర్మాణాలకు నిలయాలుగా మారుతున్నది. ఇప్పటికే ఫ్లై ఓవర్ల మీదుగా వెళుతున్న మెట్రో, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఐకానిక్ నిర్మాణాలుగా చెరగని ముద్ర వేసుకున్నాయి. కాగా, అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థల జాబితాలోకి హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పద్మవ్యూహాలను చీల్చుకుంటూ సాకారమవుతున్న వ్యూహాత్మకదారుల పథకం ఎస్ఆర్డీపీ చేరింది. మొదటి దశలో రూ.8092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, కేబుల్ బ్రిడ్జీలు, స్టీల్ బ్రిడ్జీలు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాల్లో ముఖ్యంగా నాలుగు ఫ్లై ఓవర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉప్పల్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ జంక్షన్ల మీదుగా చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు అద్భుతంగా నిలుస్తున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే భూమి నుంచి దాదాపు 19 మీటర్ల ఎత్తులో వాహనదారుడు ప్రయాణం చేసే వీలు ఉండడం, వంతెనల మీద వంతెనలు ప్రత్యేక హైలెట్‌గా నిలుస్తున్నాయి. కాగా, ఉప్పల్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద మెట్రో పై నుంచి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే రూ.69.47 కోట్లతో బయో డైవర్సిటీ జంక్షన్ మీదుగా అందుబాటులోకి వచ్చిన ఫ్లై ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, రెండు నెలల్లోగా రాబోతున్న గచ్చిబౌలి జంక్షన్ ఫ్లై ఓవర్లు ఐటీ కారిడార్‌కు మరింత వన్నెను తీసుకురాబోతున్నాయి.
గచ్చిబౌలి ఫ్లెఓవర్ విశేషాలు..
గచ్చిబౌలి ఐటీ కారిడార్ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ. 676.80కోట్ల వ్యయంతో 1.75 కిలో మీటర్ల పొడవున ఫ్లైఓవర్ నిర్మాణం పనులకు 2020 మార్చి 1న శ్రీకారం చుట్టారు. గచ్చిబౌలి జంక్షన్ మీదుగా రెండు వైపులా శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ నాలుగు లేన్లతో , కొండాపూర్ వైపున ఆరు లేన్లతో ఓఆర్ఆర్కు అనుసంధానం చేస్తూ నిర్మాణ పనులు చేపడుతున్నారు.
మీనాక్షి టవర్స్, ఐకియా ఫర్నిచర్ నుంచి ఓఆర్ఆర్ వరకు బై డైరెక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణం.
గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై నుంచి ఓఆర్ఆర్పైకి నేరుగా వాహనాలు దిగేలా, ఎక్కేలా ప్రత్యేక ర్యాంపుల ఏర్పాటు.
మీనాక్షి టవర్స్, ఐకియాల నుంచి నేరుగా ఓల్డ్ ముంబై హైవేను కలిపేలా గచ్చిబౌలి ప్రధాన రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద మరో రెండు ర్యాంపుల నిర్మాణం.
ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్‌లను కలుపుతూ మరో ఫ్లైఓవర్ నిర్మాణం.
ఓఆర్ఆర్పై దిగేందుకు, పైకి వెళ్లేందుకు వీలుగా రెండు ర్యాంపుల ఏర్పాటు.
ఫ్లై ఓవర్ నుంచి నేరుగా ఓల్డ్ ముంబై హైవేను కలిపేలా మరో రెండు ర్యాంపుల ఏర్పాటు.
రూ.516.29కోట్లతోఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు ఫ్లై ఓవర్ ..
ఆర్టీసీ క్రాస్ రోడ్ మార్గంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు, రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు బై-డైరెక్షనల్ ఎలివేటెడ్ కారిడార్ (స్టీల్ బ్రిడ్జి) నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. రెండు దశల్లో పనులను పూర్తి చేసేందుకు రూ.516.29 కోట్లను కేటాయించింది. మొదటి దశలో ఇందిరాపార్క్ చౌరస్తా, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు 2.631 కిలోమీటర్ల పొడవుతో 16.61 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల కారిడార్ నిర్మాణం పనులకు 2020 జూలై 11న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసుకొని గడిచిన కొన్ని రోజులుగా పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెండో దశలో రూ.76 కోట్లతో 900 మీటర్ల పొడవు, 13.61 వెడల్పుతో రాంనగర్ నుంచి వీఎస్టీ మీదుగా బాగ్‌లింగంపల్లి ఇండియన్ హుమ్ పైప్ కార్పొరేషన్ వరకు మూడు లేన్ల వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్, సికింద్రాబాద్ ప్రధాన రహదారికి రాంనగర్-బాగ్‌లింగంపల్లి రోడ్ ప్రత్యామ్నాయంగా మారుతుంది.
ప్రయోజనాలు
ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ జంక్షన్ వరకు, హిందీ మహా విద్యాలయ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సమయం ఆదా అవుతుంది.
ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇదే మార్గంలో ఇందిరాపార్క్, అశోక్‌నగర్ క్రాస్ రోడ్, ఆర్టీసీ, బాగ్ లింగంపల్లి జంక్షన్ల వద్ద ఇప్పటి వరకు ఉన్న ట్రాఫిక్ కష్టాలకు శాశ్వతంగా చెక్ పడనుంది
రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వెళ్లే వారికి లబ్ధి జరగనుంది. వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు దోహదపడనుంది.
ఉప్పల్ ప్రాజెక్టు విశేషాలు..
ఉప్పల్ జంక్షన్లో గ్రేడ్ సఫరేటర్/భారీ వంతెన, అండర్‌పాస్ నిర్మాణ వ్యయం రూ. 450 కోట్లు
ఎలివేటెడ్ కారిడార్ పొడవు -1080 మీటర్లు, ఆరు లేన్లతో 24.4 మీటర్లు
కర్ ఫ్లై ఓవర్ (స్టేడియం రోడ్) -440 మీటర్లు , మూడు లేన్లతో 11.4 మీటర్లు
మెట్రో ఫిల్లర్ల వెంబడి ఇరువైపులా 445 మీటర్లు , మూడు లేన్లతో 12 మీటర్ల మేర..
2015 సంవత్సరంలో ఉప్పల్ కూడలిలో గంటకు ఫ్యాసింజర్ కార్ యూనిట్ 11334 ఉండగా, 2035 సంవత్సరం నాటికి 18148 మేర వాహన రద్దీ ఉంటుందని అంచనా. ఈ గ్రేడ్ సఫరేటర్తో ఉప్పల్ జంక్షన్లో 100 శాతం ట్రాఫిక్‌కు శాశ్వత విముక్తి లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.