హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): జన్మనిచ్చిన అమ్మానాన్నలను చూడని పిల్లలను రేపు వాళ్లు పిల్లలను కన్న తర్వాత అవే దయనీయ పరిస్థితులను ఎదురొనాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. కన్నవాళ్ల బాగోగులు చూడాల్సింది కేవలం బాధ్యత అనుకుంటే పొరపాటని, మానవీయతతో ముడిపడిన విషయమని మరిచిపోయే దుస్థితి ఏ పిల్లలకు రాకూడదని ఆవేదనాభరిత వ్యాఖ్య చేసింది. అమ్మనాన్నలను చూడటమనేది పిల్లల నైతిక బాధ్యత అని, చట్టం ప్రకారం పెద్దలను పిల్లలే చూడాలని తేల్చి చెప్పింది. అమ్మానాన్నల ఆస్తి కావాలి కానీ వాళ్ల ఆలనాపాలన తమది కాదంటే ఎలాగని పిల్లలను ప్రశ్నించింది. తమ ముందున్న కేసులో అమ్మానాన్నల బాగోగులను చూడని వాళ్ల వారసులు చట్టం ముందు తప్పించుకోలేదని హెచ్చరించింది. భార్యాభర్తల వివాదంలో పిల్లలు, భార్యకు భరణం ఇవ్వడం లాంటిదే తల్లిదండ్రుల పోషణకు పిల్లలు చెల్లించాలన్న విషయాన్ని మరిచిపోవద్దని చెప్పింది. హైదరాబాద్ ఉప్పగూడలోని తమ కొడుకు కె.శ్రీనివాస్, కోడలు మాధవి తమను పట్టించుకోవడం లేదని, జీవనం కోసం డబ్బులు కూడా ఇవ్వడం లేదని తల్లిదండ్రులు కె.గౌరమ్మ, కె.దయానంద్ హైకోర్టు మెట్లు ఎకాల్సివచ్చింది.
దీనిని జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి గురువారం విచారణ చేస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.శంకర్ వాదిస్తూ, సీనియర్ సిటిజన్స్ చట్టం, తల్లిదండ్రుల సంక్షేమ చట్టం కింద తల్లికి నెలకు రూ.10 వేలు చెల్లించాలని తమ కేసులో ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారని, తండ్రి నిర్వహణకు ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేస్తే ఫలితం లేకపోవడంతో హైకోర్టుకు రావాల్సివచ్చిందని తెలిపారు. తల్లిదండ్రులకు చెందిన ఛత్రినాక ఇంటిలో కొడుకు, కోడలు ఉండటమే కాకుండా ఆ ఇంటిపై నెలకు రూ.30 వేలు అద్దె వసూళ్లు చేసుకుంటున్నారని తెలిపారు. పిటిషనర్ బీడీఎల్‌లో చేసి రిటైర్డు అయ్యారని, పెన్షన్ కూడా రాదని, ఇల్లును తిరిగి పిటిషనర్లకు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై కొడుకు తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఉల్లిగడ్డల వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారని, తల్లిదండ్రులు నెలకు చెరో పది వేలు అడుగుతున్నారని, ఆ మొత్తం ఇవ్వలేని ఆర్థిక పరిస్థితిలో ఉన్నారని చెప్పాడు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఈ నెల 27న జరిగే విచారణకు కొడుకు శ్రీనివాస్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.